Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మినీవర్కర్లు, ఆయాలు లేని టీచర్లకు, టీచర్లు లేని ఆయాలకు మే నెలలో 15 రోజుల వేసవి సెలవులు ఇవ్వాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ శాఖ కమిషనర్‌కు ఆ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.పద్మ, పి.జయలక్ష్మి, కోశాధికారి కె.సునీత లేఖ రాశారు. 'మినీవర్కర్లు లేని టీచర్లు, టీచర్లు లేని ఆయాలకు సెలవులపై రాష్ట్ర సర్కారు జారీ చేసిన సర్క్యూలర్‌లో స్పష్టత లేదు. గతేడాది వారికి 15 రోజుల సెలవులు ఇచ్చింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం అదే విధంగా నిర్ణయం చేస్తుందని వారు ఆశపడ్డారు. కానీ, నేటి వరకు కూడా విడిగా సర్క్యూలర్ రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆయాలు లేకుండా మినీ వర్కర్ల వ్యవస్థను నిర్మించడం, నేటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నది. ఈ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అంతే తప్ప సెలవుల్లేకుండా పని చేయించుకోవడం సబబు కాదు. అందరితో సమానంగా వారికి కూడా గతేడాది ఇచ్చినట్టు 15 రోజుల సెలవులు ఇవ్వాలి' అని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు గతేడాది జారీ చేసిన సర్క్యూలర్‌ను కూడా జతపరిచారు.