Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
దేశంలోనే నిజమైన రైతు నాయకుడు సీఎం కేసీఆరేనని, రైతు కోసం సకాలంలో ఎరువులు, కరెంట్, సాగునీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని, తక్కువ రోజుల్లో పంటలు చేతికి వచ్చే హైబ్రిడ్ విత్తనాలు వినియోగించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట తరహాలో నంగునూరులో నాలుగు లైన్ల రహదారిపై బట్టర్ ఫ్లై లైట్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నంగునూరు మండలం కొనాయపల్లి గ్రామంలో దుద్దెడ- బంధారం, కొనాయపల్లి- ముండ్రాయి గ్రామాలను కలుపుకుని వెళ్లే డబుల్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ ఆలయమైన కొనాయపల్లి వెంకటేశ్వరాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంగునూరు మండలం నర్మెట సీతారాముల బ్రహౌత్సవాలను పురస్కరించుకుని సుదర్శన హౌమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంగునూరులో బట్టర్ ఫ్లై వెలుగులో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నూతన తహసీల్దార్ కార్యాలయం, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ భవనం, మండల పరిషత్తు కార్యాలయ భవనాలను ప్రారంభించారు. అనంతరం నంగునూరు ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నంగునూరు మండలంలో రూ.307 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.200 కోట్లతో నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతో వాగు అవతలి గ్రామాలకు అందేలా ఏర్పాటు చేశామన్నారు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో 80 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు అన్ని రకాల సబ్సిడీలు ప్రభుత్వం ఇస్తున్నదని, దాని కోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు పెట్టామన్నారు. నంగునూరు మీదుగా వెళ్తున్న ఔటర్ రింగురోడ్డుతో నంగునూరు దశ దిశ మారుతుందని తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో గతుకులమయం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అన్నింటా బతుకులమయంగా మారిందన్నారు. బతుకు దెరువు కోసం బయటకు వెళ్లే వాళ్లు, ఇవాళ పక్క రాష్ట్రాల వారికి తెలంగాణలో ఉపాధి కల్పిస్తూ బతుకుతున్నారని వెల్లడించారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మెన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీటీసీ తడిసిన ఉమావెంకట్ రెడ్డి, ఏంపీపీ జాప అరుణా దేవి, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ దిలీప్ నాయక్, ఇంచార్జి ఎంపీడీవో వేణుగోపాల్, గ్రామ సర్పంచ్ చౌడుచర్ల మమతా జయపాల్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.