Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవమానించిన చోటే ఆత్మగౌరవం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- వారం రోజుల్లో నీరా, తాటిముంజలతో ఐస్‌క్రీం
- 'రక్షిత మోకు'కు పరిశోధనలు చేస్తున్నామని వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'కల్లులో కల్తీ ఉందని, నీరాలో ఆల్కహాల్ ఉందని గౌడ వృత్తిని అవమానించారు. అవమానించిన చోటే గౌడన్న ఆత్మగౌరవం కాపాడేలా వేదామృతమైన నీరా కేఫ్‌ను ప్రారంభించుకున్నాం. తాటి చెట్టు ప్రమాదాలను నివారించడానికి 'రక్షిత మోకు' కోసం ఐఐటీ పరిశోధనలు చేస్తున్నది. త్వరలోనే ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం' అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరాకేఫ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిపి బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకతి సిద్ధమైన నీరా, అనుబంధ ఉత్పత్తులైన తేనె, బూస్ట్, షుగర్, బెల్లం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారని అన్నారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం రూ.5లక్షల బీమాను కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైనవారికి దాదాపు లక్షమంది గీత కార్మికులకు ప్రతి నెల రూ.2016 పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. మద్యం దుకాణాల్లో గౌడ సామాజిక వర్గానికి 15శాతం, ఎస్సీ, ఎస్టీలకు 15శాతం రిజర్వేషన్లు కల్పించటం సాహసోపేతమైన, చారిత్రాత్మక నిర్ణయమని వివరించారు. గీత వృత్తికి ప్రోత్సాహం కోసం హరితహారంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 4.20 కోట్ల తాటి, ఈత మొక్కలు నాటామని పేర్కొన్నారు. తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికితే చట్టపరమైన కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.
తాటి, ఈత చెట్ల రెంటల్‌ను శాశ్వతంగా రద్దుతోపాటు గీత కార్మికుల పాత బకాయిలు రూ.8కోట్లను రద్దు చేశామని గుర్తు చేశారు. గీత కార్మికులు ఎంతో సాహసోపేతంగా గీత వత్తిని కొనసాగిస్తున్నారని వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాపన్న నిర్మించిన కోటలను పరిరక్షించి వాటిని పురావస్తు కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే భువనగిరి కోట, జాఫర్ఘడ్ కోట, కిలాషాపూర్ కోట, తాటికొండ కోట, కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం పాపన్నపేటలో ఉన్న సుమారు 400 ఎకరాల కోటను గ్రానైట్ మాఫియా నుండి పరిరక్షించామని, ఆ స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
గీత వత్తిలో ప్రమాదవశాత్తు జరిగే మరణాలను నివారించేందుకు తాటి చెట్టు ఎక్కే అధునాతన యంత్రాల (రక్షిత మోకు) రూపకల్పన కోసం ఐఐటీ లాంటి సాంకేతికత సంస్థల సహకారంతో పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. గీత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో గీత కార్మికుల కోసం 'గీత కార్మికుల భీమా'ను ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు నీరాకేఫ్ ముందు 'నీరాభిషేకం' చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్, రాష్ట్ర చైర్మెన్లు డాక్టర్ ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజరుకుమార్, డేవిడ్ రవికాంత్, ఖురేషి, దత్తరాజ్‌గౌడ్, చంద్రయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.