Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం చెల్లించండి
- ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు నివారించండి :సీఎం కేసీఆర్కు తెలంగాణ రైతు సంఘం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలకు తీవ్రమైన నష్టం జరిగిందని తెలంగాణ రైతు సంఘం తెలిపింది. వరి, పత్తి, మొక్కజొన్న, ముతక ధాన్యాలు, మామిడి, కూరగాయల పంటలు పెద్దఎత్తున నష్టపోయా యని పేర్కొంది. కల్లాలోని ధాన్యం తడిసిపోయిందని గుర్తు చేసింది. ఎకరానికి రూ.50 వేలు పెట్టుబడి పెట్టిన రైతులు వానలతో పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.1500 కోళ్ళు, 150 గొర్రెలు, 13 దుక్కిటెడ్లు మృత్యువాత పడ్డాయని పేర్కొంది. వెంటనే పరిహారం చెల్లించాలనీ, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు నివారించా లని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్శోభన్...బుధవారం ఈమేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. అకాల వర్షాలకు 10 లక్షల ఎకరాల్లో రూ.1800 కోట్ల విలువ గల పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. అంతకు ముందు ఫిబ్రవరిలో అకాల వర్షాల్లో ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇంత నష్టం గతంలో ఎప్పుడు వాటిల్లలేదనీ, మొత్తంగా రూ. 4850 కోట్ల పంటల నష్టం జరిగిందనే అంచనా వేశారని గుర్తు చేశారు. ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటిం చారని తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ 2022-23కి ప్రకృతి వైపరీత్యాల పరిహారానికి కేంద్ర ప్రభుత్వం రూ.472 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.157 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలనీ, 2022-23 సంవత్సరానికి కేంద్రం రూ.495 కోట్లు, రాష్ట్రం రూ.165 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ మొత్తం రూ. 1289 కోట్లవుతాయని తెలిపారు. కనీసం ఈ నిధులను రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించడం కొంతమేరకు ఉపశమనం కలుగు తున్నదని పేర్కొన్నారు. భూపేంద్రసింగ్ హుడా కమిషన్ కూడా ఇదే అంశంపై సిఫార్సులు చేసిందని తెలిపారు.
తడిసిన ధాన్యం కొంటామన్నారు...
మార్కెట్లలో తూకాలు వేయడం లేదు
తడిసిన ధాన్యాన్ని చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారనీ, మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని వారాల తరబడి తూకాలు వేయడం లేదని పేర్కొన్నారు. టార్ఫాలిన్గానీ, ఎలాంటి రక్షణ వ్యవస్థగానీ మార్కెట్ యార్డుల్లో లేదని తెలిపారు. ప్రమాణాల ప్రకారం తేమ ఉన్నప్పటికి మిల్లర్లు తగాదాలు పెట్టి, తూకం వేసిన తర్వాత 40 కిలోల బస్తాకు 4 కేజీలు కోత పెడుతున్నారని వివరించారు. వ్యవహారమంతా మార్కెట్ కమిటీలకు, ఐకెేపీ, సోసైటీలకు మిల్లర్లకు తెలిసి జరుగుతున్నదని ఫిర్యాదు చేశారు. మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని ప్రకటించడం హర్షనీయమని పేర్కొన్నారు. మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరలు ప్రకటించిన ముతక ధాన్యాలను మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులు నష్టపోకుండా మద్దతు ధరలపై రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని కోరారు. రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతోపాటు మార్కెట్ కమిటీలు సమన్వయంతో వ్యవహరించి, రైతు ప్రయోజనాలను రక్షించాలని కోరారు. సమస్య పరిష్కరానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.