Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 లక్షల మందికి ప్రయోజనం
- బడులు ప్రారంభమయ్యే నాటికి అందించేలా చర్యలు
- జూన్ మొదటివారంలోగా మన ఊరు-మనబడి పనులు పూర్తి చేయాలి : విద్యాశాఖ అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వర్క్‌బుక్స్‌ను, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీసుకున్న గొప్ప నిర్ణయమిదని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. వర్క్‌బుక్స్‌ను, నోట్ పుస్తకాలను పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ బైలింగ్వల్ (తెలుగు, ఇంగ్లీష్ రెండు మాధ్యమాల) పాఠ్యపుస్తకాలను పాఠశాలలు పున్ణ ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు అందజేయాలని కోరారు. గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రానున్న విద్యా సంవత్సరానికి రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫారాలను పాఠశాల పున్ణ ప్రారంభం నాటికి అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పున్ణ ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులోని స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫారాలను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను కోరారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సూచించారు. పాఠశాల పున్ణ ప్రారంభం రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని తెలిపారు. మన ఊరు - మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, అదనపు సంచాలకులు సిహెచ్ రమణకుమార్, లింగయ్య, జాయింట్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.