Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది జీవశాస్త్రానికి వెన్నెముక
- ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించటం అన్యాయం
- జేవీవీ మీడియా సమావేశంలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ ''డార్విన్ పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రానికి వెన్నెముక. అది హైస్కూల్ నుంచి విద్యార్థినీ విద్యార్థులకు బోధించాలి. జీవశాస్త్రంలో దాని అనువర్తనాలు అనేకం. పునరాలోచించి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. సిలబస్ ఎక్కువగా ఉన్నదని దానిని తొలగించడం అన్యాయం. ఈ పరిణామ సిద్ధాంతం లేకుండా కోవిడ్‌ను ఎదుర్కోగలిగేవారమా? ఈ సిద్ధాంతం ఏ మతానికి వ్యతిరేకం కాదు. అది వసుధైక కుటుంబ భావన... '' అని తెలిపారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మాజీ డిప్యూటీ డైరెక్టర్ మెహతాబ్ బామ్జీ మాట్లాడుతూ డార్విన్ పరిణామ సిద్ధాంతం అనేక ఆధారాలతో చెప్పబడిందని తెలిపారు. ఐసీఏఆర్ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సోమ మర్ల మాట్లాడుతూ ఎలాంటి చర్యలు, సమాలోచనలు చేయకుండా ఇష్టారాజ్యంగా సిలబస్‌లోని ముఖ్యాంశాలను తొలగించారని విమర్శించారు. వైరస్ల మధ్య సంబంధాలు, పోలికలను తెలుసుకోవడంతో పాటు కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో ఈ సిద్ధాంతం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మోడీ చెప్పిన చప్పట్లు, దీపాలు వెలిగించడం, ఆవు మూత్రం పని చేయలేదనీ, జీనోమ్ సీక్వెన్సింగ్ ఉపయోగపడిందని గుర్తుచేశారు. సైన్సు పుస్తకాల రచయిత డాక్టర్ కేబి గోపాలం మాట్లాడుతూ పరిణామ సిద్ధాంతానికి, మతానికి మధ్య పంచాయతీ లేదని స్పష్టం చేశారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రానికి ఒక పెద్ద రహదారి అని తెలిపారు. సిలబస్ హేతుబద్ధీకరణ పేరుతో పరిణామ సిద్ధాంత పాఠాన్ని పూర్తిగా తొలగించడం సహేతుకం కాదని పేర్కొన్నారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు ''ఆవర్తన పట్టిక - మూలకాల ధర్మాలు'' పాఠ్యాంశం నుంచి తొలగించడం ఎంత ఆలోచనారహితమో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం తొలగించడం అంతే అనాలోచితమని విమర్శించారు.. సిలబస్ సమతుల్యత కోసం ఇలా చేశామంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదని ఎద్దేవా చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిష్ణాతులతో చర్చించడం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇతర సంఘాలతో కలిసి ఉద్యమం
పరిణామ సిద్ధాంతాన్ని తిరిగి పాఠ్యపుస్తకాల్లో చేర్చేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శ్రీనాథ్, కోశాధికారి రావుల వరప్రసాద్ స్పష్టం చేశారు. ఇతర శాస్త్రీయ సంఘాలతో కలిసి బహిరంగసభలు, పత్రికా సమావేశాలు తదితర రూపాల్లో పోరాటం చేస్తామనీ, అప్పటికీ ప్రభుత్వం దిగి రాకుంటే విద్యార్థులను భాగస్వాములను చేసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెకుముకి కన్వీనర్, రాష్ట్ర జన విజ్ఞాన వేదిక కార్యదర్శివర్గ సభ్యులు రాజా మాట్లాడుతూ సమతుల్యత కోసం అంటూ అసమతుల్యం చేశౄరని విమర్శించారు. ''డార్విన్ పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రంలో ఒక గొప్ప విజయం. ఏ మత ఛాందసులైతే మొదట దానికి వ్యతిరేకంగా పోరాడారో వారే నేడు దాన్ని అంగీకరించక తప్పలేదు. సైన్స్ నిజం. దాని పరిధిని పెంచాలే కానీ తగ్గించరాదన్నారు.'' ఈ సమావేశంలో జేవీవీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర రావు, ప్రదాన కార్యదర్శి లింగస్వామి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సాయిబాబు, అల్తాఫ్, రాజశేఖర్, సుబ్బా రావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.