Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే మేడే నాటికి బీజేపీని గద్దె దించుతాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-నేలకొండపల్లి
కష్టజీవులు, కార్మికుల రక్తంలో నుంచి పుట్టిందే ఎర్రజెండా అని, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నాయకులు తీర్మానం చేసి రంగులతో అద్దింది కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. తొలుత పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తమ్మినేనికి ఘనస్వాగతం పలికారు. ఎర్రజెండాలు చేతబట్టి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్లో జెండాను తమ్మినేని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు దుగ్గి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు ఉద్యమాలతో సాధించిన అనేక హక్కులు, చట్టాలను దేశంలో బీజేపీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి భారీగా నిధులు తగ్గించిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల భారంతో పేదోడు బతికే పరిస్థితి లేదన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతోందని విమర్శించారు. బీజేపీ రాజకీయ లబ్ది కోసం మతాల మధ్య చిచ్చు పెడుతూ ఘర్షణ వాతావరణం సృష్టిస్తుందన్నారు. పౌర హక్కులకు భంగం కలిగిస్తూ ప్రశ్నించిన వారిపై దేశద్రోహులనే పేరుతో అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేస్తుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తూ అనాగరికమైన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు యత్నిస్తోందన్నారు. దేశాన్ని అధోగతి పాలుచేస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టి రానున్న మేడే నాటికి దాన్ని గద్దె దించడం ఖాయమన్నారు. చట్టసభల్లో పేదల పక్షాన గొంతెత్తి నిలదీసేది, అడిగేది, కడిగేది కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. రానున్న కాలంలో దేశంలో, రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ఉద్యమాలను మరింత ఉధృతం చేసి ఎర్రజెండాను యథాస్థానానికి తీసుకొచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామన్నారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. 13 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి ఉద్యోగులు, టీచర్లు, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, రైతులకు రుణమాఫీ చేయాలని, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, దళితబంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్, మండల కార్యదర్శి కె.వి రామిరెడ్డి, నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, ఏటుకూరి రామారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, భూక్య కృష్ణ, డేగల వెంకటేశ్వరరావు, మారుతి కొండలరావు, శీలం అప్పారావు, పోతనబోయిన పెరుమాళ్ళు, శాఖ కార్యదర్శి లింగనబోయిన కొండలరావు, సురేష్, దుగ్గి నరసింహారావు, వీరబాబు పాల్గొన్నారు.