Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని జిల్లాల్లో పంట నష్టం సర్వే వివరాలు పూర్తి
- కొన్ని జిల్లాల్లో పూర్తయిన మొదటి విడత సర్వే
- ఈ నెల 12 నుంచి రైతుల ఖాతాల్లో పరిహారం జమ
వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటను చూపిస్తున్న ఈ రైతు పేరు రమేష్. నేరడిగొండ మండలం కుప్టి గ్రామం. నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మొక్క జొన్న పంట వేశారు. వడగండ్ల వర్షానికి పంటంతా నేలవాలింది. దీంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఇలాంటి రైతులకు కూడా సాయం అందించేలా చర్యలు చేపడుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
వడగండ్ల వర్షాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టాల లెక్క కొలిక్కి వచ్చింది. వండగండ్ల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించారు. క్లస్టర్ల వారీగా నష్టం జరిగిన ప్రాంతాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్న అధికారులు ఆన్లైన్లో క్రోడీకరించే ప్రక్రియ చేపడుతున్నారు. సీఎం ప్రకటించిన ప్రకారం ఎకరాకు రూ.10వేల నష్ట పరిహారాన్ని ఈనెల 12వ తేదీ నుంచి అందజేస్తామని మంత్రి ఇటీవల ప్రకటించారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 3వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. తొలి విడతలో 1002 ఎకరాలు, రెండో విడతలో మరో 2వేల ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్టు తేల్చారు. వీరితోపాటు వ్యవసాయాన్ని నమ్ముకొని సాగు చేస్తున్న కౌలు రైతులను కూడా ఆదుకోవాలని సీపీఐ(ఎం), సీపీఐ కోరడంతో సీఎం ఆ మేరకు స్పందించి ప్రకటించారు. నష్టపోయిన రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందజేయనుంది. ఈ సాయం డబ్బులను ఈ నెల 12వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుందని అధికారులు చెబుతున్నారు.
పంట ఇంటికొచ్చే సమయంలో వడగండ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. వేసవిలో రబీలో సాగైన పంటలు కూడా భారీ వర్షాలకు నష్టం జరగడంతో రైతులు దీనస్థితిలో ఉన్నారు. ఈ తరుణంలో రైతులను ఆదుకుంటామని అధైర్యపడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు గ్రామాల వారీగా సర్వే చేయాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం ఆ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో 1002 ఎకరాల్లో నష్టం జరిగిందని సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఇందుకు ప్రభుత్వం రైతుల వారీగా ఎకరానికి రూ.10వేల చొప్పున జమ చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాకు రూ.కోటి విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోనూ మొదటి విడతగా నిధులను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. తాజాగా వారం రోజుల కిందట మళ్లీ వడగండ్ల వర్షం రావడంతో మొక్కజొన్న, జొన్న, వరి, మిర్చి ఇతరత్రా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ఇది వరకు నష్టం జరిగిన పంటలకే పరిహారం రాకపోగా.. తాజాగా మరింత నష్టం జరగడంతో రైతులు కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. దాంతో ప్రభుత్వం మరోసారి సర్వే చేసి వివరాలు అందజేయాలని చెప్పడంతో అధికార యంత్రంగం ఈ దిశగా చర్యలు చేపట్టింది.
ఈ నెల 12నుంచి పరిహారం..!
ప్రస్తుతం వ్యవసాయశాఖ ద్వారా రెండు విడతల్లో సర్వే పూర్తిచేసిన అధికారులు ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. మరోపక్క నష్టపోయిన రైతులకే కాకుండా కౌలు రైతులకు సంబంధించి కూడా అధికారులు గ్రామాల వారీగా వీరి వివరాలను తీసుకుంటున్నారు. రైతుల బ్యాంక్ ఖాతా, పట్టాదారు పాసుపుస్తకం తదితర వివరాలన్నీ నమోదు చేసుకుంటున్నారు. ఈ పరిహారం నేరుగా రైతుల ఖాతాలకే ప్రభుత్వం జమ చేయనుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వివరాలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది రెండు సీజన్లలో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వానాకాలం అతివృష్టి, యాసంగి అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. కనీసం పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లాలో 12,489 ఎకరాల్లో సుమారు రూ. 62 కోట్ల పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. 8,822 రైతు కుంటుబాలు రోడ్డున పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో 4721 ఎకరాల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వికారాబాద్ జిల్లాలో 7,766 ఎకరాలో 4,369 మంది రైతులు పంట నష్టపోయారు.
సర్వే పూర్తయింది
పుల్లయ్య, జిల్లా వ్యవశాఖ అధికారి, ఆదిలాబాద్
జిల్లాలో వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను సేకరించాం. ఈ ఏడాది మార్చిలో కురిసిన వర్షాలతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. 12వ తేదీ నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తుంది.