Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లపై రోడ్డెక్కిన రైతులు
- 17 శాతం తేమ నిబంధనలకు మిల్లర్ల పాతర
- తడిసిన ధాన్యం కొంటామన్న ప్రభుత్వ ఆదేశం గాలికి
నవతెలంగాణ- రామాయంపేట/బెజ్జంకి
వరిధాన్యం సేకరణలో మిల్లర్లు సిండికేట్గా మారి నిబంధనలకు పాతరేసి రైతులకు కొర్రీలు పెడుతున్నారని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నిబంధనల ప్రకారం మిల్లర్లు వరిధాన్యం సేకరించుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోలు కేంద్రం వద్ద మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ గురువారం రైతులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామ ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద మిల్లర్లు.. ఎక్కడాలేని నిబంధనలను అమలు చేస్తూ కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దుక్కి దున్నినకాడి నుంచి పంట చేతికొచ్చే వరకు అడుగడుగునా అవస్థలు తప్పడంలేదన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినా.. 13 నుంచి 14 తేమ శాతమున్న వరిధాన్యాన్నే కొనుగోలు చేస్తామని కరాకండిగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 శాతం తేమ ఉన్న వరిధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా భేషరుతుగా కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామ రైతులు.. ధాన్యంలో తేమ పేరుతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట, రాళ్ల వర్షానికి పంటపైనే నేలరాలిందని, మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరబోసిన ధాన్యం ఎండగానే, తిరిగి మళ్లీ వర్షం పడి.. తడిసిపోతుందని, మొలకలు వచ్చి ఇప్పటికే బరువు పూర్తిగా తగ్గిపోయిందని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. ధాన్యం కొనుగోలు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.