Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లుల్లో తప్పులున్నాయా? రాజ్యాంగ వ్యతిరేక అంశాలున్నాయా?
- వాటిని ఆపడంతో విద్యార్థులకు నిరుద్యోగులకు,రాష్ట్రానికి నష్టం :హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజకీయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడాలనుకుంటే గవర్నర్ తమిళిసై మళ్లీ బీజేపీలో చేరొచ్చుగా... అంటూ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. గురువారం హైదరాబాద్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన తొమ్మిది బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారనీ, ఆ బిల్లుల్లో తప్పులున్నాయా? రాజ్యాంగ వ్యతిరేక అంశాలున్నాయా? అని ప్రశ్నించారు. బిల్లులను పెండింగ్‌లో పెట్టడం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు రాష్ట్రం నష్టపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ పద్ధతి సరిగా లేదని తెలిపారు. ఒకవైపు నా ప్రభుత్వమంటూనే....రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసేలా సీ-20 సమ్మిట్‌లో మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
అభివద్ధి కోణంలో ఆలోచించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నాలుగేండ్లు పెంచితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రయివేటు యూనివర్సిటీల బిల్లులను ఎందుకు ఆపారో చెప్పాలన్నారు. దీంతో ప్రొఫెసర్ల నియామకం చేపట్టలేకపోయామనీ, విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారని విమర్శించారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వంగా తాము కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే దాన్నెందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఏడు నెలలుగా యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు పెండింగ్‌లో పెట్టారనీ, దాంట్లో తప్పేముందో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే తప్ప కదలిక ఉండని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో 1960 నుంచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఒడిశా ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కామన్ నియామకాలు చేపడుతున్నదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా గవర్నర్ చర్యలుంటున్నాయని తప్పుపట్టారు.
సచివాలయం ప్రారంభానికి గవర్నర్ పిలవాలని రాజ్యాంగంలో ఉందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. పార్లమెంటు భవనం, వందేమాతరం రైళ్ల ప్రారంభానికి రాష్ట్రపతిని పిలుస్తున్నారా? అని నిలదీశారు. తాము మహిళా గవర్నర్ అని గౌరవిస్తే...ఆమె రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని తెలిపారు. ''ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని గవర్నర్ భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారు.. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. .వైద్యశాఖలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆపారు..ఆ బిల్లులో అభ్యంతర కరమైన అంశాలు ఏమున్నాయి. .అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏండ్లకు పదవీ విరమణ పెంచారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ 70 ఏండ్లకు పదవి విరమణ వయసును పెంచవచ్చని మార్గదర్శకాల్లోనే ఉంది. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్ కు ఎందుకు? ఉమ్మడి జాబితా లో కొన్ని అంశాలు రాష్ట్రం జాబితాలో మరి కొన్ని అంశాలు ఉంటాయి.. వాటి కనుగుణంగా బిల్లులు ఉన్నాయా? లేదా? అని చూడటం వరకే గవర్నర్ భాద్యత. సుప్రీం కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గవర్నర్ బిల్లులు ఆపొచ్చు.ఈ బిల్లుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా?. ...పదవీ విరమణ వయస్సు బిల్లును ఏడు నెలలు ఆపడం ద్వారా ప్రజలకు నష్టం చేశారు. .బెంగాల్లో 70 యేండ్లు ఉన్నపుడు ఇక్కడ 65 కు కూడా గవర్నర్ ఒప్పుకోరా? .... '' అని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఒక డాక్టర్ అయి ఉండి తమిళ సై ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం భావ్యం కాదన్నారు. ముఖ్యమైన బిల్లులు ఆపడం ద్వారా గవర్నర్ ప్రజలకు విద్య వైద్యం దూరం చేస్తున్నారని విమర్శించారు. నోటితో నవ్వుతూ నొసటితో గవర్నర్ వెక్కిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ ఇపుడు అలాంటి బిల్లునే అడ్డుకుంటున్నారని గుర్తుచేశారు. మహారాష్ట్ర కర్నాటకల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీ మంజూరైనా...బిల్లు ఆమోదించకపోవడం వల్ల దానికి ప్రొఫెసర్ల కొరత ఉందని తెలిపారు.
కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు...
సీఎం కేసీఆర్‌పై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ఎన్నిసార్లు పోటి చేసినా గెలిచారా? అని ప్రశ్నించారు. ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలు సీఎం కేసీఆర్ ప్రారంభించారనీ, ఒక్క ఎయిమ్స్ తెచ్చి పీఎం డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాష్ట్రం గురించి తెలిసినంత కూడా గవర్నర్‌కు తెలియదని విమర్శించారు.