Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక నుంచి నెలవారీగా పురోగతిపై సమీక్ష
- పది రోజుల్లో నిమ్స్ కొత్త నిర్మాణం టెండర్ పూర్తి చేయాలి
- నెలాఖరు వరకు పల్లె దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేయాలి
- పని వేళలు, వైద్యుడి ఫోన్ నెంబర్ బోర్డులపై ప్రదర్శించాలి : వైద్యారోగ్యశాఖపై సమీక్షలో మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలనీ, ప్రారంభించేందుకు సిద్దం చేయాలని చెప్పారు. గ్రేటర్ పరిధితోపాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్నగర్ , ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2,000 పడకల బిల్డింగ్కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక నుంచి నెలవారీగా వీటి పురోగతిపై సమీక్ష చేస్తానని, అధికారులు పురోగతి నివేదికలతో సిద్దంగా ఉండాలని సూచిం చారు.
గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ కొత్త భవనం, డయాలిసిస్ సేవలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా ఒక వైపు వైద్యం, మరోవైపు వైద్య విద్యను విస్తృతం చేస్తున్నట్టు చెప్పారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ తరుపున అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఆర్ అండ్ బి అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాలి
ప్రారంభానికి సిద్దంగా ఉన్న డయాలిసిస్ కేంద్రాలు స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభించి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మూడు క్లస్టర్లుగా విభజించి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకు పరిశీలన బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు.
జూన్ ఆఖరుకు 500 బస్తీ దవాఖానలు...
హైదరాబాద్ పరిధిలో 350, ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో 57 బస్తీ దవాఖానలు. వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసు కోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం కూడా సేవలు అందిస్తున్నామనీ, అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు సేవలు అందించాలని చెప్పారు.
డాక్టర్ నెంబర్ బోర్డుపై ప్రదర్శించాలి...
ఈ నెలాఖరు వరకు 3,206 పల్లె దవాఖనలు పూర్తి స్థాయిలో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరం అయిన 321 ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. 9 నుంచి 4 గంటల వరకు పని చేయాలనీ, పల్లె దవాఖాన పని వేళలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్ ఫోన్ నెంబర్ కూడా ప్రజ లకు అందుబాటులో ఉండేలా బోర్డుపై ఏర్పాటు చేయాలన్నారు.
కంటి వెలుగు పరీక్షలు అందరికీ చేయాలి...
కంటి వెలుగు పరీక్షలు అందరికి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 67 పని దినాల్లో 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, డీఎంఈ డాక్టర్ కె.రమేష్ రెడ్డి, డీహెచ్ డాక్టర్ శ్రీనివాస రావు, టీవీవిపి కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, టిఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఈ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.