Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టుల యాక్షన్ టీమ్‌లపై కన్నేసి ఉంచండి: ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
- సరిహద్దు ప్రాంతాల ఎస్పీతో డీజీపీ వర్క్ షాప్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఈ సంధర్భంగా మావోయిస్టు యాక్షన్ టీమ్‌లపై కన్నేసి ఉంచాలని రాష్ట్ర డీజీపీ ఐజీలు, ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ లో ని బస్తర్ దక్షిణ ప్రాంతంలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో 10 మంది సాయుధ జవాన్లు బలైన నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఎ న్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎత్తుగడలపై పోలీసు అధికారులతో ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. గురువారం జరిగిన ఈ వర్క్‌షాప్‌లో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా అణచినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో సాగుతున్న వారి కార్యకలాపాల తో ఎల్లప్పుడూ రాష్ట్ర పోలీసులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పలు బహుళజాతి కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులతో కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల ద్వారా జరిగే ఏ చిన్న విధ్వంసమైన పారిశ్రాకాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఏ చిన్న విధ్వంసమైనా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి సవాల్ గా నిలస్తుందని డీజీపీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలోని పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా త్వరలోనే ఎన్నికలు సమీపిస్తుండటంతో దానిని ఆసరాగా తీసుకుని మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు రంగప్రవేశం చేసే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. రాష్ట్ర పోలీసు శాఖలో ఎనభై శాతం మంది కొత్తగా రిక్రూట్ అయిన వారున్నందున మావోయిస్టుల కార్యకలాపాలపై వారికి సమగ్రంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు తగిన రీతిలో ఆయా జిల్లాల ఎస్పీలు యాక్షన్ ప్లాన్లను రూపొందించుకుని అనుసరించాలని అన్నారు. గ్రేహౌండ్స్ అదనపు డీజీ విజరుకుమార్ మాట్లాడుతూ మావోయిస్టుల కార్యకలాపాలకనుగుణంగా వారిపై ఆధిపత్య ం సాధించే తీరులో పోలీసు బలగాలకు శిక్షణ నిస్తున్నామని అన్నారు.