Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బుల విషయంలో గొడవ వల్లే..
- పరారీలో నిందితుడు
నవతెలంగాణ-ధూల్ పేట్
రాష్ట్ర హైకోర్టు ముందు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. డబ్బుల విషయంలో గొడవ వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ చార్మినార్ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ గురు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం..
జియాగూడకు చెందిన మిథున్(35) ఐదారేండ్లుగా హైకోర్టు ముందున్న సులబ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నాడు. ఆ సమీపంలో అజాం అనే వ్యక్తి బండిపై పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరికి పరిచయం ఉంది. ఈ క్రమంలో మిథున్ వద్ద అజాం డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని అజాంను తరచూ అడుగుతున్నాడు. ఇదే విషయంలో గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరిగి వాదులాడుకున్నారు. మాటామాటా పెరగడంతో.. అజాం కోపంతో పండ్ల బండిపై ఉన్న చాకుతో మిథున్‌పై దాడి చేశాడు. తలకు, గొంతుకు తీవ్ర గాయాలు అవ్వడంతో మిథున్ అక్కడికక్కడే మృతిచెందాడు. పదివేల రూపాయల కోసమే ఈ దారుణం జరిగిందని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అజాం పాతబస్తీ తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.