Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూపల్లితో కలిసి మాజీ ఎంపీతో చేరికల కమిటీ చర్చలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ గురువారం భేటీ అయింది. ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో దాదాపు 3 గంటలకుపైగా చర్చలు సాగాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పొంగులేటి ఇంటికి బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేతృత్వంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వెన్నం శ్రీనివాసరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వచ్చారు. వీరు రావడానికి ఓ అరగంట ముందే జూపల్లి పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. పొంగులేటి, జూపల్లి చేరికల కమిటీతో భేటీ అయ్యారు. చివరకు పొంగులేటి ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశంలో ఎలాంటి స్పష్టతా రాలేదు.
చర్చల అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో పొంగులేటి, జూపల్లి వారి వెంట లేరు. తామంతా వ్యక్తిగత స్నేహితులమని, తమ ఎజెండా ఒక్కటేనని కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమేననని ఈటల చెప్పుకొచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మెన్ అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకే తాము ఇక్కడికి వచ్చామన్నారు. బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లిని కోరామన్నారు. తమ ఆశయం.. వారి ఎజెండా ఒక్కటే కాబట్టి సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, పొంగులేటితో భేటీ విషయం తనకు తెలియదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కరీంనగర్లో చెప్పారు. తన దగ్గర ఫోన్ లేదు కాబట్టి సమాచారం ఇవ్వకపోయి ఉండొచ్చని, దీనిలో తప్పేమీ లేదనడం కొసమెరుపు.
ఇంకా ఎలాంటి నిర్ణయం లేదు : పొంగులేటి, జూపల్లి
బీజేపీ చేరికల కమిటీ బృందానికి వీడ్కోలు పలికాక పొంగులేటి, జూపల్లి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం లేదన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా పార్టీలను సంఘటితం చేస్తామన్నారు. ఏ చర్చలైనా ప్రాథమిక దశలోనే ఉన్నాయని పొంగులేటి చెప్పారు. ఇంకా ఎన్నికలకు ఐదారు నెలల సమయం ఉంది.. అనుచరులు, అభిమానుల అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని పొంగులేటి, జూపల్లి తెలిపారు.