Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నిధులను కూడా రాష్ట్రం అన్నదాతలకు ఇవ్వడం లేదు
- పంట నష్టాలకు బీమా అవసరం
- కోర్టులు తోసిన బండరాయి కదట్లేదు : రైతు స్వరాజ్య వేదికలో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రకృతి వైపరీత్యాలకు రైతులే బలిపశువులవుతున్నారని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. నష్టపోయినా కౌలు రైతులను నమోదు చేసి అకౌంట్లలో నేరుగా చెల్లించాలని కోరారు. పంట నష్టం పరిహారం ఇవ్వాలంటూ కోర్టు లు చెబుతున్నా...రాష్ట్ర ప్రభుత్వం బండరాయిలా కదట్లేదని విమర్శించారు.పంట నష్టపోయిన బీమా కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలనీ, ధాన్యం సేకరణ కేంద్రాలు పెంచాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో 'తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టాలు పంటల బీమా అవసరం' అనే అంశంపై వేదిక నాయకులు కన్నెగంటి రవి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ 56వేల కోట్ల పంట నష్టపోయిందని చెప్పారు. పంట బీమా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. పంట నష్ట ప్రాంతాల్లో సీఎం, మంత్రులు పర్యటించి, ఎకరాకు రూ. 10వేలు ఇస్తామని చెప్పినా, రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల కోసం కేంద్రం ఏటా నిధులు ఇస్తున్నా...రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వడం లేదన్నారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో మద్దతు ధరలపై బోనస్ ఇస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం ధనవంతులకు ఉపయోగ పడుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ ప్రణాళికే లేదని ఎద్దేవా చేశారు. ధరణి లోపాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిచేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందుల దృష్ట్యా పంట బీమా అమలు చేయాలని కోరారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ రైతులకు రుణ సౌకర్యం లేకపోవడంతో ప్రయివేటు వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారని చెప్పారు. అప్పులు తీర్చేందుకు అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకుంటున్నారని తెలిపారు. రైతులు ఉపయోగించే ఉపకరణాల ధరలు పెరిగి, రైతులపై భారం పడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకోసం సీఎం ఇంటివద్ద ధర్నా చేయాల్సిన అవసరముందన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల కంటే వడగండ్ల వాన నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని విమర్శించారు. వ్యవసాయ విపత్తులను బీఆర్ఎస్, బీజేపీ రాజకీ యాలకు ఉపయోగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్లలో రైతు తమ ధాన్యాన్ని అమ్ము కునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. సోషల్ డెమెక్రటిక్ ఫోరం అధ్యక్షులు ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల సమస్యలపై డ్రామా ఆడుతున్నదని విమర్శించారు. రైతులను పట్టించుకోవడంలేదని చెప్పారు. అనం తరం రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పిం చేందుకు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అరెస్టు చేశారు. వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో సోమశేఖరరావు, విస్సాకిరణ్, ఆమ్ అద్మీ పార్టీ నేత డాక్టర్ సుధాకర్, దళిత బహుజన ఫ్రంట్ అద్యక్షులు పి శంకర్ పాల్గొన్నారు.