Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వండి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - నకిరేకల్
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని లక్ష్మిసుజాత ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని గురువారం తమ్మినేని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్నారు. కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పట్టాల్లేక ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతుందని చెప్పారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గోనె సంచుల కొరత తీవ్రంగా ఉందన్నారు. 10 లారీలకు సరిపడా పంపాల్సిన గోనె సంచులను ఒకటి రెండు లారీలకు మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల నుంచి అన్లోడ్ మిల్లర్ల వద్ద జాప్యం జరుగుతుందని వివరించారు. ధాన్యాన్ని తూకం వేయడానికి తేమను సాకుగా చూపుతున్నారని, తరుగు తీయడం, బిల్లులో కోతలు పెట్టడం ద్వారా రైతులకు నష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐకేపీ కేంద్రాల్లో సరిపోయే విధంగా గోనెసంచులు, లారీలు, పట్టాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన అన్ని పంటల వివరాలను సేకరించి పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. ఆయన వెంట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, డీవైఎఫ్ఐ డివిజన్ మాజీ కార్యదర్శి రవీంద్రచారి, స్టాలిన్, సురేష్ ఉన్నారు.