Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలి
- తనఖా పెడితే ఏ బ్యాంకైనా రూ.15వేల కోట్ల రుణమిస్తుంది
- ప్రభుత్వాస్తుల అమ్మకంపై తొందరెందుకు?
- ఎన్హెచ్ఐ అభ్యంతరాలను రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు
- బ్లాక్ లిస్ట్‌లోని కంపెనీకి టెండర్ ఎలా దక్కింది?: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వెనుక వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఐఆర్బీ సంస్థను ముందు పెట్టి ఫెనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసి కేటీఆర్ మిత్రులు ఈ సంస్థలోకి వస్తారు. తద్వారా అది కేటీఆర్ చేతుల్లోకి వెళ్తుంది. రేపు కేటీఆర్ అమెరికాలో స్థిరపడ్డా, కేసీఆర్ ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నా నెలకు రూ.100 కోట్ల ఆదాయం వచ్చే వనరుగా ఓఆర్ఆర్ను వినియోగించుకునే ప్రయత్నం'' అని టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్పై ఇంత రాద్దాంతం జరుగుతుంటే సంబంధిత అంశంపై వివరణ ఇవ్వకుండా కేటీఆర్ ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. '' ఓఆర్ఆర్ పై 2006లో తీసుకున్న రూ. 6,696 కోట్ల రుణం గతేడాది మార్చి 31తో తీరిపోయింది. ఓఆర్ఆర్కు ప్రస్తుతం ఏ రకంగా చూసినా లక్ష కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఏడాదికి రూ.700 కోట్ల ఆదాయం వస్తున్నది. 30 ఏండ్లలో రూ.22 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. 30 ఏండ్ల ఆదాయాన్ని తనఖా పెడితే..వచ్చే ఆదాయంలో 70 శాతం 15 వేల కోట్ల రుణం ఏ బ్యాంక్ అయినా ఇస్తుంది. 48 గంటల్లో రుణం ఇప్పించేందుకు నేను కషి చేస్తా. కేసీఆర్ ప్రభుత్వానికి..ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు తొందరెందుకు? మూడు నెలల్లో పోయే ప్రభుత్వం 30 ఏండ్లకు లీజుకిస్తున్నది. తక్షణమే ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేసి స్విస్ ఛాలెంజ్ విధానంలో బేస్‌ప్రైస్ రూ. 7,388 కోట్లతో కొత్త టెండర్లను ఆహ్వానించాలి' అని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రయివేటుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో ఎన్హెచ్ఏఐ అభ్యంతరాలను సైతం పట్టించుకోలేదని విమర్శించారు. ఓఆర్ఆర్ను ఐఆర్బీకి కట్టబెట్టేందుకే హెచ్ఎండీఏ పరిధిలోకి మార్చడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ వెంట గ్రీనరీ బాధ్యతను సర్కారే తీసుకున్నదనీ, దీనిని వల్ల ఐఆర్బీకి రూ.1,200 కోట్ల రూపాయలు మిగులుతాయని చెప్పారు. వాస్తవంగా రూ. 6000 కోట్లకే టెండర్ దక్కినట్టు లెక్క అని వివరించారు. మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని అర్వింద్‌కుమార్ చెప్పడం సరిగాదనీ, ఆ సంస్థపై అనేక దేశాల్లో కేసులున్నాయని చెప్పారు. బ్లాక్‌లిస్టులో ఉన్న ఐఆర్బీకి టెండర్ ఎలా కట్టబెడుతారని నిలదీశారు.
''అర్వింద్‌కుమార్ మేం లేవనెత్తిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. ఆర్టీఐ ప్రకారం అడిగిన సమాచారాన్నీ ఇవ్వలేదు. తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రయివేటుకు అమ్మడానికి వీల్లేదు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను అగ్గువకే ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. ఓఆర్ఆర్ బిడ్‌లో అవినీతి నిజం. దోపిడీ నిజం. దీనికి సూత్రధారి, పాత్రధారి అర్వింద్కుమార్నే. ఆయనపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిిర్యాదు చేస్తాం. కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీవోపీటీ కు అరవింద్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తా. ఓఆర్ఆర్ అంశంపై విచారణ చేయాల్సిందిగా కాగ్ కూడా ఫిర్యాదు చేస్తాం'' అని రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే దీనిపై న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని స్పష్టం చేశారు.
సరూర్‌నగర్ సభలో యూత్ డిక్లరేషన్
సరూర్‌నగర్‌లో ఈ నెల 8న నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారనీ, ఆ సభలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులు, నిరుద్యోగులను ఎలా ఆదుకుంటామనే విషయాన్ని డిక్లరేషన్ రూపంలో వివరిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు.
దేశం గర్వించేలా చేసినందుకు...రెజ్లర్లకు ఇదేనా రివార్డ్? : రేవంత్ రెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ట్వీటర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మహిళా సాధికారతపై బీజేపీ బూటకపు మాటలు చెబుతుండగా, ఒక ఒలింపిక్ పతక విజేత, ఇతర రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వం నిరసనకారులపై తన బలాన్ని ప్రయోగిస్తోంది. కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు!. పతకాలు తెచ్చి దేశం గర్వించేలా చేసినందుకు ఇదేనా రివార్డ్...?!'' అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.