Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగులేటితో ఈటల భేటీపై బండి పెదవి విరుపు
- ఫోన్ లేకపోవడంతోనే అంటూ ముక్తాయింపు
- బండి వర్సెస్ ఈటల అన్నట్టుగా వ్యవహారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కమలనాథుల్లో విభేదాలు గుప్పుమన్నాయి. పార్టీ అధ్యక్షుడికి తెలియకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయి. తాజాగా బండి సంజయ్‌కి చెప్పకుండానే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకత్వంలో బృందం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశమవుతున్నది. పార్టీకి సంబంధం లేని ఓ కీలకమైన నాయకుడితో సమావేశం కావడానికి ముందు పార్టీ అధ్యక్షుడితో మాట వరసకైనా చెప్పకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. చేరిక కమిటీ చైర్మెన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు పొంగులేటిని కలవాలనే ఆదేశాలున్నప్పటికీ బండిని టేకోవర్ చేయడం పట్ల పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. అందులోనూ ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముగ్గురు కూడా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. కాబట్టి పార్టీలో వారి పెత్తనమేంటని బండి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్పించి మార్కులు కొట్టేయాలనుకున్న ఈటల బృందానికి ఈ పరిణామాలు తలనొప్పిగా మారాయి. ఇదే విషయంపై మీడియా బండి సంజయ్‌ని ప్రశ్నిస్తే తనకు ఆ విషయం తెలియదంటూ పెదవి విరుస్తున్నారు. పైగా, తన ఫోన్ పోయింది కాబట్టి కాల్ చేయకపోయి ఉండవచ్చంటూనే..ఎవరైనా, ఎవరినైనా కలువొచ్చు అంటూ దాటవేశారు. తాజా పరిణామాల్లో ఈటలకు, బండికి పొసగడం లేదనే విషయం బహిర్గతమవుతున్నది. నిప్పులేనిదే పొగ రాదన్నట్టుగా...రాజకీయ నేతలూ తమతో విభేదాలున్న నేతల పట్ల సూటిగా కాకుండా భావాల్లో వ్యక్తపరుస్తుంటారు. చెప్పకనే తమ మాటల్లో చెప్పాల్సిదంతా చెప్పేస్తారు. వారి మాటల్లో ఆ నేతల మధ్య సఖ్యత ఎతుందనే విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు బీజేపీలో అదే జరుగుతున్నది. రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బండిని తప్పించి ఈటలకు ఆ పదవి కట్టబెట్టాలనే డిమాండ్ ఆ పార్టీలో కొద్దికాలంగా వినిపిస్తున్నది. అధిష్టానం అప్పట్లో దీనిపై ఆలోచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. అయితే, చేరికల కమిటీ చైర్మెన్‌గా ఉన్న ఈటల రాజేందర్...ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి రప్పించడంలో విఫలమయ్యారనే విషయాన్ని బండి గ్రూపు తెరపైకి తెచ్చింది. ఒక నాయకుడు ఇతర పార్టీల నుంచి రావాలంటే రాజకీయంగా వారికి కొన్ని హామీలివ్వాలి. ఈ విషయంలో ఈటలకు స్వేచ్ఛలేదు. ఎలాంటి హామీల్లేకుండా చేర్పించాలనే ప్రతిపాదన ఈటలకు ప్రతిబంధకంగా మారింది. చేరికలలేమిపై అధిష్టానం నుంచీ రాష్ట్ర పార్టీకి చురకలు అంటాయి. ఈటల తనకు ఆ పదవే వద్దంటూ పెదవికూడా విరిచారు. తనకు అన్ని విషయాల్లో అండగా ఉంటున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా కాలక్రమంలో బీజేపీ చేరారు. ఈటల, కొండా, కోమటిరెడ్డి చేరిన తర్వాత బండి ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తుందన్న భావన ఆ పార్టీలోనే మొదలైంది. మునుగోడులో కోమటిరెడ్డి గెలిస్తే తమ ఉనికికి ఎక్కడ ప్రతిబంధకంగా మారుతాడో అనే భయంతోనే బండి, అతని ముఖ్య అనుచరుడైన జి.మనోహర్‌రెడ్డి గ్రూపు తెర వెనుక నుంచి ఓడగొట్టారనే విమర్శ ఉంది. మునుగోడు ఎన్నిక ద్వారా రాష్ట్రంలో రాజకీయ పెను ప్రకంపనలు సృష్టించాలని చూసిన బీజేపీ చివరకు తాను తవ్విన గోతిలో తానే పడి చావుదెబ్బతిన్నది.
ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటలకు దగ్గరయ్యారు. మరోవైపు కులాల ఈక్వేషన్ ఆధారితంగానూ బీజేపీలో రాష్ట్ర నాయకత్వం గ్రూపులు తయారవుతున్నాయనే విమర్శ ఉంది. పార్టీపై బండి పట్టు పెరిగినా, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ కూడా ఎవరికివారే తమ పట్టు సడలకుండా చూసుకుంటున్నారు. కొత్తగా చేరిన వారు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. నేతలు అధినేతల మాటలకు జవదాటరు...క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే ఆ పార్టీలో తెలంగాణలో మాత్రం కమలం పువ్వుకు ఎన్ని రెక్కలుంటాయో అన్ని గ్రూపులున్నాయి. ఓ వైపు గ్రూపులు...మరోవైపు అధిష్టానం చురకలతో ఆ పార్టీలో ఏం జరుగుతుందో అన్న మీమాంస ఆ పార్టీ శ్రేణుల్లోనే నెలకొంది.