Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయండి
- సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రొబేషన్ కాలం ముగిసినందున జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిని పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా జేపీఎస్‌లు 2019 ఏప్రిల్ నుంచి వివిధ గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం వారి ప్రొబేషన్ కాలం గతేడాది ఏప్రిల్ నాటికే పూర్తయ్యిందని పేర్కొన్నారు. అయినా మరో ఏడాది పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ గడువు కూడా గతనెల 11వ తేదీతో ముగిసిందని వివరించారు.
రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థ ఉండకూడదన్న సీఎం జేపీఎస్‌ల నాలుగేండ్ల ప్రొబేషన్ గడువు పూర్తయినప్పటికీ రెగ్యులరైజ్ చేయకపోవడం బాధాకరమని తెలిపారు. జేపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ గ్రామాలకు అనేక అవార్డులు కూడా వారు తీసుకొచ్చారని తెలిపారు. స్థానిక సంస్థల్లో వారి పాత్ర చాలా కీలకమైనదని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, గత ఏడు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని కోరారు.
డిమాండ్లు
- జూనియర్ పంచాయతీ కార్య దర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవోను విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. గడిచిన నాలుగేండ్ల ప్రొబేషన్ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలి.
- ప్రస్తుతం పని చేస్తున్న ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులనందరినీ జేపీ ఎస్‌లుగా ప్రమోట్ చేస్తూ పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్‌లో భాగంగా పరిగణించి వారిని రెగ్యులరైజ్ చేయాలి.
- రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్‌ని నిర్ధారించి ప్రకటించాలి.
- మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాల నుంచి కారుణ్య నియమకాలు చేపట్టాలి.
- అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలి.
- జీవో నెంబర్ 317 వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలి. పరస్పర బదిలీలు, స్పౌస్ బదిలీలకు అవకాశమివ్వాలి.