Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు వర్సిటీల ఇష్టారాజ్యం
- అనుమతి రాకుండానే అడ్మిషన్లు
- అబద్ధపు ప్రకటనలతో ప్రవేశాలు కల్పించిన యాజమాన్యాలు
- నిబంధనలు ఉల్లంఘించిన శ్రీనిధి, గురునానక్
- రూ.లక్షల్లో ఫీజులు వసూలు
- చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ప్రయివేటు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థులు బలికావాల్సి వచ్చింది. వారి బతుకులు ఆగమయ్యాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ఆ ప్రయివేటు విశ్వవిద్యాల యాలపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. విద్యార్థులకు నష్టం కలిగించిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే 2022-23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టాయి. శ్రీనిధి, గురునానక్ ప్రయివేటు విశ్వవిద్యాలయాలు నిబంధనలకు యధేచ్చగా తిలోదకాలిచ్చాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అనుమతి వచ్చిందంటూ అబద్ధపు ప్రచారాలు చేసి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి వారి నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. తరగతులు కూడా జరిగాయి. కానీ వారికి ఇంత వరకు పరీక్షలను నిర్వహించలేదు. అయితే గతనెల 24న ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీంతో విద్యార్థుల బతుకులు రోడ్డున పడ్డాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం వారు నష్టపోవాల్సి వస్తున్నది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఇదేంటని యాజమా న్యాలను ప్రశ్నిస్తే విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్టు తెలిసింది.
డబ్బు, కాలం వృధా...
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో మహీంద్రా, మల్లారెడ్డి, వాక్సన్, అనురాగ్, ఎస్ఆర్ విద్యాసంస్థలు ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. వాటిలో ప్రవేశాలు రెండు విద్యాసంవత్సరాలుగా జరుగుతున్నాయి. 2022, సెప్టెంబర్ 13న రాష్ట్రంలో మరో ఐదు ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందులో శ్రీనిధి విశ్వవిద్యాలయం (ఘట్కేసర్), గురునానక్ విశ్వవిద్యాలయం (ఇబ్రహీంపట్నం), నిక్మర్ కన్స్ట్రక్షన్ విశ్వవిద్యాలయం (శామీర్పేట), ఎంఎన్ఆర్ విశ్వవిద్యాలయం (సంగారెడ్డి), కావేరి విశ్వవిద్యాలయం (గౌరారం) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. కానీ ఆమె ఆమోదించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును గతనెల 24వ తేదీన గవర్నర్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఎలాగైనా అనుమతి వస్తుందని భావించి శ్రీనిధి, గురునానక్ విశ్వవిద్యాలయాలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టాయి. వేలాది మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందారు. తీరా అనుమతి రాకపోవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. లక్షల రూపాయల డబ్బు, ఏడాది కాలం వృధా అయ్యింది.ఇది నయవంచన అంటూ విద్యార్థులు విమర్శిస్తున్నారు. యాజమాన్యాలను నిలదీశారు. అనుమతి రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించినట్టు తెలిస్తోంది. గవర్నర్ ఆ బిల్లును తిరిగి పంపించడంతో ఇప్పుడీ యాజమాన్యాలు కేంద్రంలోని బీజేపీ పెద్దల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వివరణలతో కూడిన ఆ బిల్లును గవర్నర్ కార్యాలయానికి పంపిస్తుందనీ, ఆ తర్వాత గవర్నర్ ఆమోదిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
చలనం లేని విద్యాశాఖ
శ్రీనిధి, గురునానక్ విశ్వవిద్యాలయాలు ప్రవేశాలు చేపట్టినట్టు తెలిసినా ఉన్నత విద్యాశాఖ కనీస చర్యలకు పూనుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యార్థుల బతుకులు ఆగం అవుతున్నా చలనం లేకుండా వ్యవహరిస్తున్నదంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇంకోవైపు తనిఖీల వరకే తమకు భాగస్వామ్యం ఉందంటూ ఉన్నత విద్యామండలి అధికారులు చెప్తు న్నారు.ప్రయివేటు విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా ఉన్నత విద్యాశా ఖ పరిధిలో ఉంటుందని అంటున్నారు. విద్యార్థులు రోడ్డున పడుతున్నా స్పందించ కపోవడం పట్ల విద్యాశాఖ తీరుపై విమర్శలొస్తున్నాయి. అనుమతి రాకున్నా అడ్మిషన్లు చేపట్టిన శ్రీనిధి, గురునానక్ విశ్వవిద్యాలయాలపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.