Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణితో సర్కారు భూములు మాయం
- అసైన్డ్, సిలింగ్, వక్ఫ్‌భూములు పట్టాలుగా మార్పు
- రెవెన్యూ అధికారులు కనుసన్నల్లో రియల్ వ్యాపారుల దందా
- వందల ఎకరాల సర్కారు భూములు రియల్ వ్యాపారుల చేతుల్లోకి..
- నిర్లక్ష్య ధోరణిలో రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్‌తో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ధరణి పోర్టల్‌తో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటే రెట్టింపు స్థాయిలో పెరిగాయి. సామాన్య రైతులు తమ భూములు కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ధరణి పోర్టల్‌లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ అధికారులు రికార్డులను పూర్తిగా మార్చేస్తున్నారు. అసైన్డ్, సిలింగ్, వక్ఫ్ భూములు, ప్రభుత్వ, భూదాన్ భూములను పట్టాలుగా మార్చుతున్నారు. ఇదే అదనుగా ఈ భూములపై కన్నేసిన రియల్టర్లు అధికారులతో కుమ్మకై భూములను సొంతం చేసుకుంటున్నారు. దాంతో పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మాయమవుతున్న సర్కార్ భూములపై కథనం.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం కొంగరకుర్దు-ఏలో సుమారు 500 ఎకరాల వక్ఫ్‌భూమి ఉంది. 1954 నుంచి ఇప్పటి వరకు పట్టా కాలమ్‌లో సయ్యద్ షారాజ్ ఖత్తార్ హుస్సేన్‌సాబ్ దర్గా పేరుతో ఉంది. సర్వే నంబర్ 85, 86, 88, 89లోని 58 ఎకరాల భూమి వక్ప్భూమిగా పేర్కొంటూ 2008లో అప్పటి ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. నిన్న, మొన్నటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ప్రస్తుతం పట్టా భూములుగా మారాయి. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులను వివరణ కోరగా.. నెలలు గడిచినా సమాధానం ఇవ్వని పరిస్థితి నెలకొంది. తలకొండపల్లి మండలం ఖానాపూర్ సర్వే నంబర్ 16,18,20లో 24 ఎకరాలు, సర్వే నంబర్ 145లో 10.24 ఎకరాల పోరంబోకు భూములను భూ స్వాములు కబ్జా చేశారు. పట్టా భూముల పక్కనే ఈ భూములు ఉండటం వారికి కలిసి వచ్చింది. వీటికి హద్దులు నిర్ణయించి, భూములను కాపాడ టంలో రెవెన్యూ అధి కారులు ఘోరంగా విఫల మయ్యారు.
శేరిలింగంపల్లి మం డలం రాయదుర్గం ప్రశాంతి హిల్స్ సర్వే నంబర్ 65లో 29 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. ఖాజాగూడ సర్వే నంబర్ 27లో రూ.80 కోట్ల విలువ చేసే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు రాయదుర్గంలో సర్వే నంబర్ 46లోని 84.30 ఎకరాలు ప్రభుత్వ భూములపై రియల్టర్ల కన్ను పడింది. మియాపూర్ సర్వే నంబర్ 100, 101 లో 445 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు ఉండగా, వీటిలో మెజార్టీ భూములు పట్టా భూములుగా మారి రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయి.
పార్కుల భూములు మాయం
రాజేంద్రనగర్‌లో హెచ్ఎండీఏ 1988లో శాస్త్రీపురం సొసైటీ పేరుతో లే అవుట్ వెలసింది. 13 పార్కులను జీహెచ్ఎంసీకి రాసి ఇచ్చింది. దీనిలో రూ.30 కోట్ల విలువైన 1.30 ఎకరాల పార్కు స్థలంపై కబ్జారాయుళ్ల కన్ను పడింది. బుద్వేల్, మైలార్‌దేవులపల్లిలోని జన చైతన్య హౌసింగ్ సొసైటీ వెంచర్లో 50 పార్కులు ఉండగా వీటిలో ఇప్పటికే 20 పార్కులు అన్యాక్రాంతమమ్యాయి. రాజేంద్ర నగర్ ఎర్రబోడ సర్వే నంబర్ 7లో రెండు ఎకరాల శ్మశాన వాటిక ఉంది. దీనిలో ఇప్పటికే ఎకరం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది.
హెచ్ఎండీఏ భూమి ప్రయివేటు రియల్టర్ చేతిలోకి..
శంషాబాద్ సర్వే నంబర్లు 720 నుంచి 730 వరకు 50 ఎకరాల హెచ్ఎండీఏ భూములు ఉండగా స్థానిక నేతలు దీనిలో కొంత భూమిని కబ్జా చేసి వెంచర్ వేశారు. ఒకే ఇంటి నంబర్‌తో ఐదు ప్లాట్లు విక్రయించారు. నిజానికి అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకున్నా వాటిలో ఇండ్లు ఉన్నట్లు నిర్ధారించి ఒకే పీటీఐఎన్ నంబర్‌తో ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. ఇవే విషయాలపై జిల్లా రెవెన్యూ అధికారులను వివరణ కోరగా సరైన వివరణ ఇవ్వకుండా దాటవేస్తున్నారు.