Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీపై కేటీఆర్ ఫైర్
- గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడిగిన నాయకుడు కేసీఆర్
- నెత్తురుబారిన, నేర్రలుబారిన ఈ ప్రాంతం..గౌరవెల్లి కల్పవల్లితో విముక్తి
- హుస్నాబాద్‌కు రూ.25 కోట్లు మంజూరు : ఐటీ పురపాలక శాఖ మంత్రి
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
దేశంలో మతం పేరిట పంచాయితీలు పెట్టి పిల్లల మనసుల్లో విషం నింపుతూ బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రూ.కోటితో నిర్మించిన ఇండోర్ స్టేడియం, రూ.2.25 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం, రూ.కోటితో నిర్మించిన ఎస్టీ బాలికల హాస్టల్, రూ.16.46 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రూ.రెండుకోట్లతో నిర్మించిన ఉపాధ్యాయ శిక్షణా భవనం, రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన, రూ.1.20కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, రూ.3.50 కోట్లతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు.
విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి రూ.15 లక్షల చొప్పున ఒక్కొక్కరి జన్‌ధన్ ఖాతాల్లో వేస్తామని గొప్పలు చెప్పిన ప్రధాని మోడీ.. ఇప్పుడు తెల్ల మొఖం వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సిలిండర్ ధర రూ.400లకు పెంచితే 400 సార్లు తిట్టిన మోడీ.. ఇప్పుడు రూ.1200 గ్యాస్ ధర ఉంటే 1200 సార్లు మనం తిట్టాలన్నారు.
ప్రధాని మోడీతో బాగుపడ్డది ప్రపంచంలో రెండో కుబేరుడైన అదానీనేనని అన్నారు. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ.. నేడు పకోడీలు వేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకి తగిన శాస్తి చేయాలన్నారు. బండి సంజరు.. ఈ నాలుగేండ్లలో ఎంపీ నిధుల నుంచి ఒక్క పైసా హుస్నాబాద్‌కు తేలేదని ఆరోపించారు. తవ్వాల్సింది మసీదులు కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పునాదులు, అభివృద్ధి పనులకు పునాదులు అని తెలిపారు. హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతమని, మిర్రలుబారిన.. నెత్తురుబారిన నేలలు.. గౌరవెల్లి కల్పవల్లి ప్రాజెక్టుతో శాశ్వత కరువు పోయిందన్నారు. నాలుగేండ్లలో కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేర్, రాజరాజేశ్వర స్వామి సాగర్, తోటపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గోదావరి జలాలతో తెలంగాణ రైతుల కాళ్లు కడిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో 9 గంటల కరెంటులో 6 గంటలు ఉండకపోయేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అవుతుందని అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ఆకుల రజిత వెంకన్న, కర్ర శ్రీహరి, ఎంపీపీలు లకావత్ మానస, బాలోతు లక్ష్మీ బిల్లు నాయక్, జెడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మెన్ ఎడబోయిన రజనీ తిరుపతిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.