Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలి
- మల్టీపర్పస్ పనివిధానాన్ని రద్దు చేయాలి : మంత్రి ఎర్రబెల్లికి తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోనెంబర్ 60 ప్రకారం వేతనాలను పెంచాలని కోరారు. మల్టీపర్పస్ పనివిధానం రద్దు చేయాలని తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులున్నారని తెలిపారు. వారు పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, స్వీపర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ తదితర కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు చెందిన పేదలేనని వివరించారు. వారి సమస్యలను చాలా కాలంగా పరిష్కరించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని తెలిపారు. కొత్త గ్రామపంచాయతీ చట్టం వచ్చాక ప్రస్తుత జనాభా ప్రాతిపదికన కాకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం 500 మందికి ఒక కార్మికుడిని నియమించి నెలకు ఒక్కొక్కరికి రూ.8,500లు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ అవసరాల కోసం మరికొంత మంది కార్మికులను పంచాయతీ పాలకవర్గం నియమించుకున్నప్పటికీ వారందరికీ పైన పేర్కొన్న వేతనాలివ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నిర్ణయించిన వేతనాలనే అందరూ పంచుకుంటున్నారని తెలిపారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.3,500ల నుంచి రూ.4,500ల వరకు మాత్రమే వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 51 జీవోను తెచ్చి వివిధ కేటగిరీలను రద్దుచేసి మల్టీపర్పస్ పనివిధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు పనిభారం పెంచిందని వివరించారు. ఏ పనైనా చేయాలంటూ బలవంతంగా కార్మికులను వేధింపులకు గురిచేస్తూ పనిలో నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. కారోబార్లతో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్ డ్రైవర్లు, చివరికి ప్రజాప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులను కూడా చేయిస్తున్నారని పేర్కొన్నారు. నైపుణ్యం లేని పనులు చేయించడంతో ప్రమాదాలకు గురై చనిపోయిన కుటుంబాలను అదుకోవడం లేదని విమర్శించారు.
సమస్యలను పరిష్కరించి, సిబ్బందిని ఆదుకోవాలి
గ్రామ పంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. వారిలో అర్హులను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పీఆర్సీ నిర్ణయం ప్రకారం రూ.19 వేల వేతనం చెల్లించాలని తెలిపారు. ఆలోపు జీవోనెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య సిబ్బందికి రూ.15,600లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు, ఇతర స్కిల్డ్ సిబ్బందికి రూ.19,500లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర టెక్నికల్ సిబ్బందికి రూ..22,700లు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం అవసరాలకనుగుణంగా కార్మికులను తీసుకోవాలని పేర్కొన్నారు. బకాయి వేతనాలను చెల్లించాలని తెలిపారు. ఆదాయమున్న మేజర్ పంచాయతీల్లో వేతనాల పెంపునకు అనుమతినివ్వాలని సూచించారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి వివిధ కేటగిరీలను యధావిధిగా కొనసాగించాలని పేర్కొన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు. అర్హతకల్గిన వారందరినీ పంచాయతీ కార్యదర్శులుగా తీసుకోవాలని తెలిపారు. రూ.రెండు లక్షలున్న ఇన్సూరెన్స్‌ను రూ.ఐదు లక్షలకు పెంచాలని సూచించారు. పీఎఫ్, ఈఎస్ఐతోపాటు, ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, అంత్యక్రియలకు రూ.30 వేల ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు. సిబ్బందికి ఏడాదికి ఒకసారి బట్టలు, ఇతర సౌకర్యాలందివ్వాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల విపరీత జోక్యాన్ని అరికట్టాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించటానికి సానుకూలంగా స్పందించాలని మంత్రి ఎర్రబెల్లిని తమ్మినేని కోరారు.