Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహా ప్రదర్శనతో కదంతొక్కిన ఆదివాసీలు
- ఆకట్టుకున్న సంప్రదాయ వేషధారణలు
- అగ్రభాగాన ఆదివాసీ ఉద్యమ నేతలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాద్రి పురవీధుల్లో రేలా హౌరు కొనసాగింది. డోలు.. విల్లంబులు.. కొమ్ముల తలపాగలు.. నెమలి ఈకల కుసుడీ టోపీలు.. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడే వేషధారణలతో ఆదివాసీలు కదం తొక్కారు.. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర మూడో మహాసభలను పురస్కరించుకొని శుక్రవారం జరిగిన బహిరంగ సభ, ప్రదర్శన ఆకట్టుకుంది. భూమిపై హక్కు.. ఉపాధి.. అభివృద్ధి.. సంక్షేమం... ఆదివాసీ హక్కుల రక్షణకై పోరాడుదాం.. అంటూ నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ అగ్రభాగంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు బృందాకరత్ సహా ఆదివాసీ ఉద్యమ నేతలు ఉన్నారు. వివిధ ప్రాంతాల ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడింది. అడవి అందాలు పురవీధుల్లో విరబూశాయా అన్న చందంగా ప్రదర్శన సాగింది. వివిధ కళాశాలల విద్యార్థులు ర్యాలీని స్వాగతిస్తూ మద్దతు తెలిపారు.ప్రదర్శన జూనియర్ కళాశాల మైదానం వద్దకు చేరుకోవడానికి ముందు కొమరం భీమ్ విగ్రహానికి బృంద, టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ పూలమాలలు వేసి సభాస్థలానికి చేరుకున్నారు. ఆదివాసీ నృత్యాలతో అతిథులను సాదరంగా అహ్వానించారు.