Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు ఎస్సీకేఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.మధు లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతామని 2018 ఎన్నికల సందర్భంగా రామగుండంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి రక్షణ కోసం టీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన భాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. సింగరేణి యాజమాన్యం జీవో 22 అమలు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. సింగరేణిలో సుమారు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారనీ, బొగ్గు ఉత్పత్తిలో, సింగరేణి సాధిస్తున్న లాభాలలో, సంస్ధ అభివృద్ధిలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దాగి ఉందని గుర్తుచేశారు.
కాంట్రాక్టు కార్మికులు లేకుండా సింగరేణి ఒక్కరోజు కూడా నడవదని తెలిపారు. సింగరేణి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచడంలో, కోలిండియా ఒప్పందాలను అమలు చేయడంలో, కార్మిక చట్టాలు, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంటే సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం దారుణమని పేర్కొన్నారు. సింగరేణిలోనూ దాన్ని వర్తింపజేయాలని విన్నవించారు. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసి మున్సిపాల్టీలో చెల్లిస్తున్న విధంగా వేతనాలివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జీఓ నెం.60 లేదా జీఓ నెం.22 ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో లాభాల వాటా లేదా చట్ట ప్రకారం 20 శాతం బోనస్ చెల్లించాలని కోరారు. సింగరేణి యాజమాన్యం చేసిన ఒప్పందంలోని అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఆస్పత్రుల్లో వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించడంతో పాటు ఈఎస్ఐ సౌకర్యం వర్తింపజేయాలని కోరారు. ఖాళీ క్వార్టర్స్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని విన్నవించారు.