Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవీన్ మిట్టల్ రూ.20 కోట్ల రూసా నిధులు నిలిపేశారు : విద్యాశాఖ కమిషనర్‌పై టీయూ వీసీ తీవ్ర ఆరోపణలు
నవతెలంగాణ-డిచ్పల్లి
ప్రొఫెసర్ యాదగిరిని టీయూ రిజిస్ట్రార్‌గా ఎలాగైనా నియమించాలనే తపనతో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్.. తనపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అంతేకాకుండా.. రుసా నుంచి మంజూరైన రూ.20 కోట్ల నిధులను నవీన్ మిట్టల్ నిలిపేశారని తెలంగాణ యూనివర్సిటీ (టీయూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్, డాక్టర్ రవీందర్ ఆరోపించారు. కాగా, యూనివర్సిటీలోని సమస్యలపై శుక్రవారం విలేకరులకు రెండు పేజీల లేఖను వీసీ విడుదల చేశారు. లేఖలో తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీపై కమిషనర్ నవీన్ మిట్టల్ చేస్తున్న వివాదాలు.. క్యాంపస్‌లో శాంతియుత విద్యా వాతావరణానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ఏప్రిల్ 19, 2023న హైదరాబాద్‌లోని రూసా కార్యాలయంలో జరిగిన ఈసీ సమావేశాన్ని వ్యతిరేకించినప్పటికీ, నవీన్ మిట్టల్ ఇతర ఈసీ సభ్యులను యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించారన్నారు.
ఈసీ సమావేశాన్ని బహిష్కరించానని తనపై అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తూ చేసిన ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నానని తెలిపారు. నవీన్ మిట్టల్ ఇప్పుడు బ్యాక్టర్ పద్ధతుల ద్వారా తన పరువు తీయాలని, అస్థిరపరచాలని చూస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీలోని అన్ని స్థాయిల వారితో టచ్‌లో ఉంటూ తనపై వారిని రెచ్చగొడుతున్నారన్నారు. రోజువారీ పరిపాలనా విషయాల్లో జోక్యం చేసుకుంటూ, పూర్తిగా విషయాలను తన నియంత్రణలో ఉంచుకుంటు న్నారని, యూనివర్సిటీకి విడుదల చేయాల్సిన రుసా మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులను మిట్టల్ నిలిపివేశారని తెలిపారు.
ఇప్పటికైనా యూనివర్సిటీలో కార్యకలాపాలు యథావిధిగా శాంతియుతంగా జరగాలంటే.. నవీన్‌మిట్టల్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖలోని ఇతర ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఎలాంటి అక్రమాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. ఏ ఏజెన్సీ ద్వారానైనా న్యాయమైన విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.