Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 8న కలెక్టరేట్ల ముందు ''ధర్నాలు'' జయప్రదం చేయండి : టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలందరిని రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌తో సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియోద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో ఏఎన్ఎంలు, ఈసీ ఎఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్ఆర్డి ఏఎన్ఎంలతో పాటు అన్ని రకాల ఏఎన్ఎంలను యధావిధిగా రెగ్యులర్ చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కొంత మందిని రెగ్యులర్ చేయడం హర్షించదగ్గ విషయమే కాని అదే సందర్భంలో మెజార్టీ ఉద్యోగులను విస్మరించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. వైద్యారోగ్య రంగానికి బలమైన ఆయువు పట్టుగా ఉండి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఎన్ఎంలు రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తూ ఇప్పటికీ రెగ్యులర్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఏకకాలంలో 36 రకాల రికార్డులు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో నమోదు చేస్తున్నారనీ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలకు 8,9,10 పీఆర్సీల ప్రకారం బేసిక్ పే ఇచ్చినప్పటికీ తెలంగాణలో తొలి పీఆర్సీ బేసిక్ పే ఇవ్వకుండా 30 శాతం వేతనాలు మాత్రమే పెంచడం వలన ఏఎన్ఎంలు ప్రతినెలా రూ.ఐదు వేలు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బేసిక్ పే ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలనీ, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 23 ఏండ్ల నుంచి రెగ్యులర్ చేయకపోవడం మోసం చేయడమేనని విమర్శించారు. మే 8న ప్రభుత్వ స్పందనను బట్టి మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.