Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేమూ సహకరిస్తాం : సీఎండీ ప్రభాకర్‌రావు సూచన
- సమ్మె నోటీసుపై సీఐటీయూ నాయకులతో చర్చలు
- సమ్మె వాయిదా : టీఎస్‌యూఈఈయూ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'ప్రతి డిమాండూ న్యాయమైనదే. వాటిని పరిష్కరించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. సీపీఐ(ఎం), సీఐటీయూ తరుపున సీఎంను కలవండి. యాజమాన్యం తరుపునా మేమూ సహకరిస్తాం' అని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సూచించారు. టీఎస్‌యూఈఈయూ(సీఐటీయూ) ఇచ్చిన సమ్మె నోటీసులో ఇచ్చిన డిమాండ్లపై శుక్రవారం ప్రభాకర్‌రావుతో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్రావు చర్చించారు. ఆర్టీజన్ కన్వర్షన్, డిపార్ట్మెంట్ ఎగ్జీస్టింగ్ రూల్స్‌కు కొంత సమయం ఇచ్చి మళ్ళీ ఒకసారి రండి పరిశీలిస్తామని సీఎండీ తెలిపారు. పీస్ రేటు, 2011జేఎల్ఎం ఎరియర్స్, జేఎల్ఎం ప్రమోషన్ల వంటి అంశాలపై సంబంధిత కంపెనీ యాజమాన్యాన్ని కలవాలని సూచించారు. ప్రస్తుత కీలకమైన పరిస్థితుల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నదని, సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఈ విషయాన్ని, కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా గట్టి ప్రయత్నం చేస్తామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నాయకుల అభిప్రాయం మేరకు, ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేసుకుని, రాష్ట్ర స్థాయిలో కార్మిక వర్గానికి ధైర్యాన్ని నింపడంతోపాటు ఐక్యంగా ముందుకెళ్లాలని యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దీంతో ఈనెల 5 నుంచి తలపెట్టిన సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి, వెంకటేష్‌లకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు కె.ఈశ్వర్రావు, వి.గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు.