Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
వచ్చే నెలలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం హుస్సేన్‌సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిఫ్ట్‌లు, ఎస్కులేటర్, కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్, నిరంతరం వెలిగే జ్యోతి ఆకతి ఇలా అన్ని రకాల పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. హైదరాబాద్ నగరం నడి బొడ్డున, హుస్సేన్ సాగర్ తీరాన ఈ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. అరుదైన స్టెయిన్స్టీల్తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్‌తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనన్నారు. ఈ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని తెలిపారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు ఉండబోతున్నాయని చెప్పారు. ఇది పూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని కోరారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యతనివ్వాలన్నారు. ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని అదేశించారు. అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని సూచించారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు,ఆర్కిటెక్ట్, తదితరులు పాల్గొన్నారు.