Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం రామన్నపేటలో సామాజిక బహిష్కరణ చేయడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. సామాజిక బహిష్కరణకు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకుని నివేదిక అందజేయాలని పోలీసులను ఆదేశించింది. జేజీ.నర్సయ్య ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్.ఎం.సుధీర్ విచారించారు. బహిష్కరణ చర్యలు రద్దుకు, అందుకు బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. అదే విధంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలన్నారు. పిటిషనర్ కోరినట్లుగా విచారణ కమిషన్ అవసరం లేదన్నారు. 300 ముదిరాజ్ కుటుంబాలను మార్చి 20న బహిష్కరించారని పిటిషనర్ తరుపు న్యాయవాది చెప్పారు. బహిష్కరణకు గురైన వాళ్లను వ్యాపార దుకాణాల నుంచి ఖాళీ చేయించారని తెలిపారు. సుమారు ఎనిమిదిన్నర దశాబ్ధాల క్రితం ఐదు ఎకరాల్లో నిర్మించిన ఆలయ ఆవరణలో ఇసుక నిల్వలు, బెల్ట్ షాపుల వ్యవహారంలో సామాజిక బహిష్కరణ జరిగిందన్నారు.