Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆదివారం వరకే గడువున్నది. ఈ ఏడాది ఈ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. వారిలో ఈ ఏడాది జనరల్‌లో 98,612 మంది, వికలాంగులు 2,685 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 25,057 మంది, ఓబీసీల్లో 67,613 మంది, ఎస్సీల్లో 37,536 మంది, ఎస్టీల్లో 18,752 మంది కలిపి మొత్తం 2,50,255 మంది అభ్యర్థులున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆన్లైన్లో గతనెల 30వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లకు తుది గడువు ఆదివారం వరకు ఉన్నది. ఈనెల ఎనిమిదో తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశమున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష జూన్ నాలుగో తేదీన ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. ప్రాథమిక సమాధానాల కీని వచ్చేనెల 11న, ఫలితాలను అదేనెల 18న విడుదల చేస్తారు. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తు పల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్‌తో మొత్తం 13 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 22 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు న్నాయి. ఇతర వివరాలకు www.jeeadv.ac.in వెబ్‌సైట్‌ను చూడాలి.