Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సుల్తాన్ బజార్
ఏడేండ్ల చిన్నారికి కోఠి ఈఎన్టీ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, డాక్టర్ సంపత్ కుమార్ సింగ్‌లు శుక్రవారం వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా తిలక్‌నగర్‌కు చెందిన ఏడేండ్ల లహరి ప్రియకు పుట్టుక నుంచే స్వరపేటిక ప్రవేశ భాగంలో పొరలు అడ్డుగా ఉన్నాయి. దాంతో చిన్నారికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. ఈ మేరకు వైద్యులు ట్రేకియాష్టమీ చేసి అనంతరం అత్యాధునిక ప్రక్రియ కాంబ్లేషన్ సర్జరీ ద్వారా ల్యరెంజియల్ వెబ్‌ను తొలగించారు. ట్రేకియాష్టమీ ద్వారా పొరలను మూసివేసి ముక్కు ద్వారానే శ్వాస తీసుకునేలా చేశారు. దాంతో చిన్నారి మామూలుగా మాట్లాడేలా చేశారు. ఈ సందర్భంగా చిన్నారికి మెడికల్ కిట్‌ను అందించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. సమావేశంలో డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, అనిస్తీసియా డాక్టర్ ఉమా, డాక్టర్ హమీద్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అభినందించారు.