Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఆఫీసుల వద్ద ధర్నాలు
- టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కర్ణాటకలో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నదనిటీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. హిందూత్వ ముసుగులో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చర్యలు అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని విమర్శించారు. తమ ఆరోపణలు తప్పని భావిస్తే, కర్ణాటకలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ ఓడించాలని పిలుపునివ్వాలని సీఎం కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. కర్ణాటకలో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ కాంగ్రెస్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టిందన్నారు. ఈ రకమైన పోకడలు తెలంగాణ రాజకీయ సంస్కృతికి మంచివా? బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇలాంటి చర్యలతో మీ గౌరవం పెరగదని వ్యాఖ్యానించారు. మీరు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర హనుమాన్ చాలీసా చదువుకుందామని సూచించారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నేతలు ఇటువంటి నాటకాలాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో బీజేపీకి 50 మంది కార్పొరేటర్లు, కేంద్రమంత్రి, ఎంపీ ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధిని ఎందుకు ఏకగ్రీవంగా చేశారని ప్రశ్నించారు. బీజేపీ మౌనంగా ఉండటంలో అంతర్యమేంటని నిలదీశారు. మీ పార్టీ అభ్యర్ధిని ఎందుకు బరిలో దించలేదని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజరు, బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని ఆరోపించారు. సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయాన్ని కూల్చితే మాట్లాడని కిషన్‌రెడ్డి హనుమాన్ చాలీసా గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ప్రయివేటు సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తా?
జీవో 647 రహస్యమెందుకు?
సీఎం కేసీఆర్ ప్రయివేటు సెక్రటరీగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి శరత్ మర్కట్‌ను ఎలా నియమిస్తారని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ నిరుద్యోగులను పట్టించుకునేది లేదు కానీ పరాయి వ్యక్తులకు ఇక్కడి ప్రజల సొమ్మును వినియోగిస్తారా? అని నిలదీశారు. సంబంధిత జీవో 647ను కూడా రహస్యంగా ఉంచారని విమర్శించారు. ఏడాదికి రూ. 18 లక్షల జీతం ఇస్తున్నారనీ, పరాయి వ్యక్తులకు తెలంగాణ ప్రజల సొమ్మును జీతాల రూపంలో చెల్లిసున్నారని చెప్పారు. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు.
ముఖ్యనేతలతో రేవంత్ సమావేశం
8న యువ సంఘర్షణ సభపై చర్చ
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ విడుదల
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో భారీ బహిరంగసభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఈమేరకు శుక్రవారం గాంధీభవన్‌లో రేవంత్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈనెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో జరగనున్న సభకు 'యువ సంఘర్షణ సభ'గా పేరు నిర్ణయించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏం చేయబోతున్నదో 'హైదరాబాద్ యూత్ డిక్లరేషన్' పేరుతో ఓ పత్రాన్ని ప్రియాంకగాంధీ విడుదల చేయనున్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.