Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారులకు దారిచూపే మరోప్రపంచం
- చదువేకాదు... ఆటపాటలూ ముఖ్యమే:
బాలోత్సవం సమ్మర్ క్యాంపు ప్రారంభంలో సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
- ఆకట్టుకున్న చొక్కాపు వెంకటరమణ మ్యాజిక్ షో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీసే గొప్ప వేదిక బాలోత్సవం అని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు. బడే కాదు మరోప్రపంచం ఒకటి ఉందని చిన్నారులకు తెలియజెప్పే చోటని ప్రశంసించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం సమ్మర్ క్యాంపును ఆయన ప్రారంభించారు. పిల్లల మధ్య తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుని తానూ వారిలో ఒకరైపోయారు. పిల్లల ప్రపంచంలో మైమరిచి పోయారు. అంతకుముందు ప్రముఖ మెజీషియన్ చొక్కాపు వెంకటరమణ మ్యాజిక్ షో ప్రదర్శిం చారు. మాయల్లేవు..మర్మాల్లేవు..మ్యాజిక్ కూడా ఒక కళే అని చాటిచెప్పారు. ఆయన ప్రదర్శనను పిల్లలు ఆసక్తిగా తిలకించారు. కేరింతలు కొడుతూ ఇదే ఇదే మేం కోరుకునే ప్రపంచం అంటూ సంతోషం వ్యక్తంచేశారు. చిన్నారులూ తమ ఆటపాటల ద్వారా అలరించారు. అంతకుముందు ప్రారంభోత్సవం సందర్భంగా సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ..పిల్లలకు బడి, చదువే ప్రపంచం కాదనీ, సమాజం గురించి కూడా తెలుసుకోవాలని సూచించారు.
పిల్లల్లో కొత్త ఆలోచనలకు పురుడుపోసుకునేందుకు, సృజనాత్మక శక్తులను వెలికితీసేందుకు వేసవి సెలవులు దోహదపడాలని ఆకాంక్షించారు. ఆకలితో ఉన్న పిల్లలకు చేపలు ఇవ్వడం కాదు..చేపలు పట్టడం నేర్పాల్సిన అవసరం పెద్దలపై ఉందని నొక్కిచెప్పారు. ఎండాకాలం సెలవుల్లో ఆటలు, డ్యాన్స్, డ్రాయింగ్, పాటలు పాడటం వంటివి నేర్చుకోవాలన్నారు. పాఠశాలకు భిన్నంగా బాలోత్సవ్ వేదిక ఉంటుందనీ, పిల్లలు తమ అభిరుచులను, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపర్చాలని సూచించారు. ఇక్కడ బట్టీ విధానం అసలే ఉండదన్నారు. కొత్త స్నేహితులను దొరక బుచ్చుకోవాలన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పట్టుసాధిం చాలన్నారు. స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవాలన్నారు. బాలోత్సవంలో పాఠశాల వాతావరణానికి భిన్నమైన ప్రపంచాన్ని పిల్లలకు నిర్వాహకులు చూపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో బాలోత్సవం లాంటి వేదికలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. నేటి సమాజంలో కొందరికి చదువు చెప్పటం ఆర్థిక వనరుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
చదువు అమ్మడం సరిగాదనీ, ఒకరు మరొకరికి పంచాల్సినదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణ బాలోత్సవం అధ్యక్ష, కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్లు, ఎన్.సోమయ్య మాట్లాడుతూ..సమ్మర్ క్యాంపు 20వ తేదీ వరకు ఎస్వీకేలోనే కొనసాగుతుందనీ, 21న ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ క్యాంపులో 150 మంది పిల్లలు చేరారన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు క్లాసులు ఉంటాయని చెప్పారు.
ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయనీ, ఈ విషయంలో పిల్లలకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పిల్లల్లో సృజనాత్మక శక్తులను వెలికితీసే క్లాసులు, గణితంలో మెళుకువలతో పాటు పిల్లలకు డ్యాన్స్, పాటలు పాడటం, డ్రాయింగ్ వంటివి నేర్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కె.శాంతారావు, ఎస్వీకే బాధ్యులు బుచ్చిరెడ్డి, బాలోత్సవం నిర్వాహకులు, టీచర్లు అనుముల ప్రభాకరాచారి, సుజావతి, రూపారుక్మిణి, మమత, సరస్వతి, నవీన్, పద్మావతి, సుశీల, దయానందచారి, రాజు, తదితరులు పాల్గొన్నారు.