Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 58 ద్వారా ఇండ్ల పట్టాలివ్వాలి
- ఉపాధి హామీని పకడ్బందీగా అమలు చేయాలి : బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరెంటుబిల్లు, ఇంటిపన్నుతో సంబంధం లేకుండా ఇండ్ల ప్లాట్లకు జీవో 58 ద్వారా ఇంటి పట్టాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ..రాష్ట్రంలో వందలాది కేంద్రాల్లో వేలాది మంది గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారనీ, దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఇండ్ల పట్టాలివ్వాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కలిపి మొత్తంగా ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటిజాగాలు, నిర్మాణ వ్యయం ఇచ్చే వరకూ ఉద్యమాలు చేస్తామని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఆ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు పెంచాలనీ, కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలకు బీమా అమలు చేయాలని కోరారు. భూ, ఇండ్లస్థలాలు, కూలి పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, మహిళా కన్వీనర్ బి.పద్మ పాల్గొన్నారు.