Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులను గుర్తించటంలో ఆలస్యమే కారణం
- లక్షా 35వేల మంది కోసమే సీఎం తొలి సంతకం
- సర్కారు జాప్యంపై ఆందోళననలు..
- ఎన్నికల వరకు సాగదీస్తారంటూ అనుమానాలు
''ఫిబ్రవరి నెలాఖరులో తప్ప కుండా పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం. పోడుభూములు ఇవ్వడమే కాదు, వాళ్లకు రైతుబంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం. వాళ్లకు కరెంటు సదుపాయం కూడా కల్పిస్తాం. అవసరమైతే గిరి వికాసం కింద తీసుకుని నీటి సౌకర్యం కల్పిస్తాం.'' ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది.
ఇలా ప్రకటించి మూడు నెలలు పూర్తయింది. ఏప్రిల్ 30న మరో సారి బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభమైన సందర్భంగా పోడు భూముల పైలుపై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఇందులో కేవలం లక్షా 35వేల మంది లబ్దిదారులకు 3.9లక్షల ఎకరాలు మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో పోడు సాగుదారుల్లో ఆందోళన మొదలైంది. పట్టాలు అందరికా? కొందరికేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ బ్యూరో ఎస్. వెంకన్న
2021 అక్టోబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేశారు. అందులో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో అటవీ హక్కుల గుర్తింపు (ఆర్ఓఎఫ్ఆర్) -2006 చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించారు. దాని ప్రకారం రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి 4,14,353 దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్టు అధికారులు చెబుతున్నారు. వాటి ప్రకారం లెక్కిస్తే 12,46,846 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉందని అంచనా వేశారు.
కొలిక్కి రాని పంపిణీ వ్యవహారం..
అయితే నేటికి పోడు భూముల పంపిణీ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ గడిచినా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించే వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. పోడు భూముల విషయంలో కేసీఆర్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు. అనేక సందర్బాలున్నాయి. 2021 ఏప్రిల్ 14న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓ ప్రకటన చేశారు. ''నేను అధికారులను వెంట పెట్టుకుని పర్సనల్గా నాగార్జున సాగర్ వస్తా. రెండు రోజులు ఇక్కడే ఉంటా. పోడు భూముల సమస్య పరిష్కరిస్తా. అందుకు ప్రజా దర్భార్ కూడా ఏర్పాటు చేస్తాం.'' అని కేసీఆర్ అప్పట్లో చెప్పారు.
జాప్యం కోసమే ప్రకటనలా?
పోడు పట్టాల పంపిణీ జాప్యం కోసమే ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారని విమర్శలున్నాయి. 2021 అక్టోబర్ 1వ తేదీన సీఎం మరో ప్రకటన చేశారు.''పోడు భూముల వ్యవహారం తేలుస్తామని మేం హామీ ఇచ్చి ఉన్నాం. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు ఉండటం, ఘర్షణపూరిత వాతావరణం ఉండటం ఏ రకంగానూ మంచిది కాదు. కాబట్టి సమస్య పరిష్కారం కావాలి.'' అని చెప్పారు. అంతకుముందు 2019 జులై 19న అసెంబ్లీలో మరో ప్రకటన చేశారు. ''అన్ని జిల్లాలకు, అన్ని డివిజన్లకు నేనే స్వయంగా పోతా.. నేను ఒక్కడినే కాదు, మంత్రివర్గాన్ని, అధికార గణాన్ని, అటవీ శాఖ ఉన్నతాధికారులను, చీఫ్ సెక్రటరీని, రెవెన్యూ సెక్రటరీని అందర్ని తీసుకెళ్లి, ప్రజాదర్బార్ పెట్టి.. ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో ఇది మీ పట్టా.. అని ఇచ్చేస్తాం.'' ఇలా ప్రకటన చేయగా..తాజాగా..''పోడు పట్టాలను త్వరలోనే పంచుతాం. గరిజనులకు తప్పక తీపి కబురు చెబుతాం''మంటూ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫిబ్రవరి 1న మీడియా సమావేశంలో చెప్పారు. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ తరఫున నివేదిక ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు. ఇలా వివిధ సందర్భాల్లో ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఎన్నికల వరకు ఇలానే సాగదీయాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నదా? అంటూ పోడు సాగుదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికలప్పుడు ఇది రాజకీయ అస్త్రంగా మారుతోందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వా లు పట్టించుకోవటం లేదని మరో పక్క గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆలస్యం కావటం వల్ల ఇప్పటికీ పలు జిల్లాల్లో పోడు భూముల విషయంలో అక్కడి అధికారులు, స్థానికుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
80శాతం భూములు అక్కడే..
తెలంగాణలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పోడు భూములు 12 జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ సర్వేలో తేలింది. 80 శాతం భూములు భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలా బాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనే ఉన్నట్లు గుర్తించారు.
చట్ట ప్రకారమైతే..
2006లో కేంద్ర ప్రభుత్వం రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్(ఆర్వోఎఫ్ఆర్) చట్టాన్ని తీసుకువచ్చింది. అటవీ హక్కుల చట్టంగా దీన్ని పిలుస్తున్నారు. అడవుల్లో ఎవరైతే బతుకుతున్నారో.. వారికి అడవి పై హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన చట్టమిది. వేటాడటం మినహా మిగిలిన హక్కులు కల్పించేలా చట్టం చేశారు. ఈ హక్కును వ్యక్తిగా లేదా గ్రూపుగా ఇస్తారు. దీని ప్రకారం 2005 డిసెం బరు 13లోపు ఆక్రమణలో ఉన్న భూములకే పట్టాలు ఇవ్వాలి. పది ఎకరా లకు మించకుండా పోడు భూములకు హక్కు కల్పించాలి. ఈ నిబంధనల ప్రకారం..పన్నెండున్నర లక్షల పోడు దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటికి పట్టాలు అందించాల్సిన బాధ్యత సర్కారుదే..