Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగణన సర్వేపత్రంలో ఆదివాసీ పదం చేర్చాలి
- హిందూత్వ ఎజెండాతో ఆదివాసీల్లోకి విరుద్ధభావాలు
- టీఏజీఎస్ మూడో మహాసభల్లో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'అస్థిత్వ రాజకీయాలు ఆర్ఎస్ఎస్ చేతిలో ఆయుధంగా మారాయి..హిందూత్వ ఎజెండాతో ఆదివాసీల్లోకి విరుద్ధ భావాలు చొప్పించి.. ఆదివాసీ అస్థిత్వానికి ఆర్ఎస్ఎస్ ముప్పుగా పరిణమించింది' అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. కుల గణనలలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు మతంతో సంబంధం లేకుండా ప్రత్యేక కాలమ్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఆదివాసీల్లోకి ప్రవేశించిన విరుద్ధ భావాలను సంఘం, సిద్ధాంతం, సంఘర్షణలతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. భద్రాచలం సమ్మక్క-సారలమ్మ ఫంక్షన్ హాల్లోని అమరవీరులు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య నగర్లో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) మూడో మహాసభలను ఉద్దేశించి బృందాకారత్ ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం అత్యంత ప్రమాదకరమని, దీనిని పోరాటాలతోనే నియంత్రించాలని సూచించారు. జార్ఘండ్‌లోని గిరిజనుల మధ్య విభేదాలు, మణిపూర్‌లో గిరిజనులు, ఆదివాసీల మధ్య అనైక్యత, తెలంగాణలో లంబాడి, ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ ఆర్ఎస్ఎస్ పబ్బం గడుపుతోందని తెలిపారు. మేడారం సమ్మక్క, సారక్క జాతరలో ఆదివాసీ సంప్రదాయాన్ని రూపుమాపి హిందూ ఆచార వ్యవహారాలను ముందుకు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆదివాసీ సంస్కృతికి బదులు హనుమంతుడు, రాముడు, దుర్గ, గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ ఆదివాసీలను హిందూ మతారాధకులు గా మార్చే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. జనగణన సర్వే పత్రంలో ఆదివాసి అనే పదం ఎక్కడా లేదని, జార్ఘండ్ ప్రభుత్వం గిరిజనులు అనే పదాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. జన గణనలో ఆదివాసీ అనే పదం లేకుంటే హిందూ అనే కాలమ్‌లోనే ఆదివాసీలు నమోదు అవుతార ని, తద్వారా ఆదివాసీల ఉనికినే అత్యంత ప్రమాదంలోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. జనాభా సర్వే పట్టికలో ఆదివాసీ అనే పదం చేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ అధికార మంచ్‌కు 15 రాష్ట్రాల్లో అనుబంధ సంఘాలు ఉన్నట్టు చెప్పారు. మంచ్ ఆధ్వర్యంలో ఆదివాసీలను సంఘటితం చేస్తున్నట్టు తెలిపారు. మంచ్‌కు అనుబంధంగా సీఏఆర్డీ (కార్డ్) అనే సంస్థను నెలకొల్పి ఆదివాసీ ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల గిరిజన సమస్యలపై సర్వేలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సంఘం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆశయాల కోసం అమరులైన వారి స్పూర్తితో ముందుకెళ్లాలని..అందుకు తాము తోడుంటామని హామీ ఇచ్చారు.
విజయవంతంగా ముగిసిన సభలు
సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మిడియం బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలు శనివారం నాటితో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల నుంచి 260 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. మహాసభల ప్రారంభానికి ముందు మిడియం బాబురావు ముందుగా టీఏజీఎస్ పతాకాన్ని ఆవిష్కరించి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేశారు. కుంజా బొజ్జి చిత్రపటానికి ఆహ్వాన కమిటీ అధ్యక్షులు రవివర్మ, సున్నం రాజయ్య చిత్రపటానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీమ్ రావు పూలమాలలు వేశారు. గత మహాసభ నుంచి నేటి వరకు మృతి చెందిన అమరవీరులకు మహాసభ సంతాపం ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు మహాసభలనుద్దేశించి సంఘీభావం తెలియజేశారు. అధ్యక్షవర్గం మిడియం బాబురావు, కూసం సచిన్, సున్నం గంగా, నాయకులు కారం పుల్లయ్య, పి.సోమయ్య, వజ్జా సురేష్, నగేష్ తదితరులు మొత్తం 16 తీర్మానాలను మహాసభల్లో ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సభల్లో బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, దుగ్గి కృష్ణ, దబ్బకట్ల లక్ష్మయ్య, ఊకే వీరస్వామి, మడివి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బాబూరావు,సచిన్
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం-టీఏజీఎస్ రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ మిడియం బాబూరావు, పూసం సచిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమ్మక్క-సారలమ్మ ఫంక్షన్ హాల్ కుంజా బొజ్జి, సున్నం రాజయ్య నగర్లో నిర్వహించిన మహాసభల్లో శనివారం ఈ ఎన్నిక జరిగింది. 34 మందితో కూడిన టీఏజీఎస్ రాష్ట్ర నూతన కమిటీ వివరాలను సీనియర్ నాయకులు పి.సోమయ్య ప్రకటించా రు. సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా భద్రాచలం మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బండారు రవికుమార్, పి.సోమయ్య, తోడసం భీమ్వరావ్, మెస్రం రాజు, సున్నం గంగ, దబ్బకట్ల లక్ష్మయ్య ఎన్నికయ్యారు. నూతన ప్రధాన కార్యదర్శిగా కూసం సచిన్ ఎన్నిక కాగా సహాయ కార్యదర్శులుగా కారం పుల్లయ్య, ఎర్మ పున్నం, బైరి సోమేశ్, సరియం కోటేశ్వరరావు, పొలం రాజేందర్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, ఆహ్వానితులుగా లంకా రాఘవులు, సూడి కృష్ణారెడ్డి, కోటా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఈ కమిటీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే ఆరుగురికి చోటు లభించింది.