Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19,95,659 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
- 9,875 గ్రామపంచాయతీ వార్డులు, మరో 3,058 మున్సిపల్ వార్డుల్లో పూర్తి
- సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 34,53,975 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అవసరమైన 19,95, 659 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 9,875 గ్రామపంచాయతీ వార్డులు, మరో 3,058 మున్సిపల్ వార్డుల్లో పరీక్షలు పూర్తయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 63,18,637 మంది పురుషులు, 71,20,703 మంది మహిళలు, 7,042 ట్రాన్స్జెండర్లున్నారు.
98,77,475 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారించారు. వంద రోజుల్లో నిర్దేశించుకున్న లక్ష్యానికి 85 శాతం పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. జనవరి 19న ప్రారంభమైన శిబిరాలు జూన్ 15తో ముగియనున్నాయి. నివారించదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో 2018లో మొదటిసారి కంటి వెలుగు పరీక్షలను నిర్వహించగా, రెండో దఫా ఇప్పుడు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు గ్రామపంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.