Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. 'గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించే బదులుగా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులును నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీల నియామకం కోసం నాలుగేండ్లు ప్రొబేషన్ కాలం పూర్తి చేసిన తరువాత వారి ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తున్నట్టు ప్రకటించారు. వీరిని 2022 ఏప్రిల్ 11 వరకు ప్రొబేషన్ కాలం పూర్తి అయిన వారిని క్రమబద్ధీకరిస్తామంటూ నోటిఫికేషన్లో వివరించారు.ఆ తరువాత ప్రొబేషన్ పిరియిడ్ను మరో ఏడాది పెంచారు. 2023 ఏప్రిల్ 11 వరకు గడువు పూర్తవుతుంద'ని తెలిపారు.
ఆ తరువాత ప్రొబేషనల్ కాలాన్ని పూర్తి చేసి రెగ్యులరైజేషన్ చేస్తారనే ఆశతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎదురు చూస్తున్నారని చాడా పేర్కొన్నారు. ఇప్పటివరకు వారి ఉద్యోగాలు క్రమబద్దీకరించకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైతున్నారని తెలిపారు. కొంతమంది విధి నిర్వహణలో మృతి చెందారని గుర్తుచేశారు. ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలనీ, నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా జూనియర్ పంజాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించటానికి జీవోను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చి రెగ్యులర్ చేయాలని కోరారు. గ్రామపంచాయతీ అభివృద్ధి పనుల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని తెలిపారు.