Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడక్కడా వర్షం పడే అవకాశం
- బంగాళాఖాతంలో అల్పపీడనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటాయి. వచ్చే రెండుమూడ్రోజుల్లో గరిష్టంగా మూడు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. గరిష్టంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటొచ్చు. శనివారం ఉదయం బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది సముద్ర మట్టం నుంచి ఫ్రోపోస్పిరిక్ స్థాయి వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడనున్నది. అది కాస్తా ఆగేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశముంది. ఆ తర్వాత మధ్య బంగాళాఖాతంవైపు కదులుతూ తీవ్రతరమై తుఫాన్‌గా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, దీని ప్రభావం వల్ల తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయి.
ఇదే క్రమంలో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగనున్నాయి. దీంతో పాటు రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో శనివారం రాత్రి 10 గంటల వరకు 150కిపైగా ప్రాంతాల్లో వర్షం పడినట్టు టీఎస్‌డీపీఎస్ తన నివేదికలో పేర్కొంది. వికారాబాద్ జిల్లా కోటేపల్లిలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 37 ప్రాంతాల్లో మోస్తరు వానపడగా..మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.