Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గీతన్న బీమా పథకం విధివిధానాలను కార్మికులకు ఉపయోగపడే విధంగా రూపొందించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం(కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్ గ్రేషియాను రూ.10లక్షలకు పెంచాలని కోరారు. గత 45 ఏండ్లుగా ఎక్స్గ్రేషియా విధానం అమలవుతున్నదని తెలిపారు. గీత కార్మికులు పోరాడి సాధించుకున్న ఈ హక్కును తొలగించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎక్స్ గ్రేషియా అంటేనే తక్షణ సహాయమని పేర్కొన్నారు. ఎక్స్గ్రేషియా ఆలస్యం అవుతుందనే పేరుతో బీమాకు మారుస్తున్నామని చెప్పడం సరైంది కాదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు ఐసీఐసీఐ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ సంస్థలకు ఇచ్చాయని గుర్తుచేశారు. గీతన్న బీమా పథకాన్ని సభ్యత్వం ఉన్న గీత కార్మికులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన వారితో పాటు రైతులకు ఇచ్చినట్లే సహజ మరణాలకు కూడా బీమాను వర్తింపజేయాలని కోరారు. భూమి ఉన్న గీత కార్మికులకు వృత్తిలో ప్రమాదం జరిగితే రైతు బీమాతో పాటు గీతన్న బీమాను వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. . ఎక్సైజ్ విధానంలో నిర్ణయించినట్టు వయస్సు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్నవారికి బీమా బాధ్యతను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.