Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబ్‌నగర్ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- ఐటీ కారిడార్ ఏర్పాటుతో మారనున్న జిల్లా ముఖచిత్రం
- అమర రాజా కంపెనీ ఆధ్వర్యంలో
- 9500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న లిథియం ఫ్యాక్టరీకి శంకుస్థాపన
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
రానున్న రెండు మూడేండ్లలో వేల ఉద్యోగాలు కల్పించనున్నామని, ఐటీ కారిడార్ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ ముఖచిత్రం మారిపోతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అంతేకాక జాతీయ రహదారి నుంచి ఐటీ టవర్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల వెడల్పు కలిగిన రహదారిని, పనులను ప్రారంభించారు. అదేవిధంగా 9500 కోట్ల పెట్టుబడితో ఐటీ కారిడార్ వద్ద అమరరాజా కంపెనీ ఏర్పాటు చేయబోయే అతిపెద్ద లిథియం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ వలసలు, కన్నీళ్ళకు మారుపేరైన మహబూబ్‌నగర్ జిల్లాలో లిథియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అమరరాజా గ్రూపు ముందుకురావడం సంతోషమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించామని తెలిపారు. దేశంలో 80 కోట్ల మంది యువత ఉన్నారని, వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. హైదరాబాదులో ఐటీ ప్రారంభం చేసినప్పుడు 3,20,000 మందికి పని కల్పిస్తే ఇప్పుడు 10 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. అమరరాజా కంపెనీ మొదటి సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలతో లిథియం ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడుతుందని, దశలవారీగా పెట్టుబడి పెంచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ బ్యాటరీ పరిశ్రమ ద్వారా ఎలాంటి కాలుష్యం ఉండదని చెప్పారు. ఇది లిడ్ ఆసిడ్ పరిశ్రమ కాదని, లిథియం ఫ్యాక్టరీ అని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దివిటిపల్లి వద్ద ఐటీ టవర్ ప్రారంభం జిల్లాలో మరచిపోలేని రోజన్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా వాసులు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లేవారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఐటీ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో 400 ఎకరాలు కేటాయించామన్నారు. అమరరాజా కంపెనీ అతిపెద్ద లిథియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం పట్ల ఆయన వారిని అభినందించారు. అలాగే 8 కంపెనీలు ఐటీ కారిడార్‌లో వారి యూనిట్లో నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో అమెరికా కంపెనీ కూడా ఒకటి ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో అమరరాజా కంపెనీ కో- ఫౌండర్ గల్లా అరుణకుమారి, కంపెనీ ఫౌండర్ డా. రామచంద్ర నాయుడు, ఏపీ ఎంపీ గల్లా జయదేవ్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్, జిల్లా కలెక్టర్ జి.రవినాయక్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, గోరేటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి, పరిగి శాసనసభ్యులు మహేష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ కే. నరసింహ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.