Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా అరుణ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు రెజ్లర్లపై లైంగిక వేదింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు. అతనిపై చర్యలు తీసుకోకుండా మోడీ సర్కారు మీనమేషాలు లెక్కించటం తగదని హితవు పలికారు. బీజేపీ నేతలు పొద్దున లేస్తే..భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడుతారనీ, మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడటం కూడా భారతీయ సంస్కృతిలో భాగమేనా? అని ప్రశ్నించారు. కుస్తీపోటీల్లో దేశ గౌరవాన్ని నిలబెడుతున్న రెజ్లర్ల ఆందోళన పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నేరస్థులనే పేరుతో కొందరిని ఇటీవల ఎన్కౌంటర్లు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాలు..బ్రిజ్‌భూషణ్ విషయంలో ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. పేరు మోసిన నేరస్థుడిని వెనుకేసుకు రావటం దేశభక్తి ఎలా అవుతుందో చెప్పాలన్నారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు తమను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అభివృద్ధే ప్రభుత్వ ద్యేయమని చెప్పే ప్రధాని మోడీ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్‌కు రెజ్లర్ల ఆందోళన కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి. జ్యోతి, బత్తుల హైమావతి, కె.ఎన్ ఆశలత, రాష్ట్ర సహాయ కార్యదర్శులు, బుగ్గవిటి సరళ, ఎమ్ భారతి, రత్నమాల, అహల్య, బి. అనురాధ. కె. నాగలక్ష్మి, శారద, స్వర్ణలత, నర్మద, రమణ, అనురాధ, శశికళ, సరోజి, తదితరులు పాల్గొన్నారు.