Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 8 నుంచి 22 వరకు దశలవారీగా నిరసనలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సర్కారు, అధికారుల బెదిరింపులు, అసత్య ప్రచారాలు, ఆటంకాల మధ్య ఐకేపీ వీఓఏల సమ్మె జరుగుతున్నదనీ, వాటికి భయపడకుండా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఐకేపీ వీఓఏ సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ స్పష్టం చేశారు. తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, కోశాధికారి వి.రాములు, కార్యదర్శులు శ్రీకాంత్, ఈశ్వర్రావు, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రాజ్‌కుమార్, ఎం.నగేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.సుధాకర్, కోశాధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ.. విశాల దృక్పథం లేని కొన్ని సంఘాలు సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాల్లో కలిసి రాకుండా అసత్యప్రచారాలు చేయడాన్ని తప్పుబట్టారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నా పట్టదా? అని ఆయా సంఘాల నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచినా రావడం లేదని ప్రచారం చేయటం తగదన్నారు. తమ తొమ్మిది డిమాండ్లలో ఇన్ని పరిష్కరిస్తాం... వీటిని పరిశీలిస్తాం... ఇవి సాధ్యం కాదనే విషయాన్ని సర్కారు మాట వరుసకు కూడా చెప్పకపోవడం దారుణమన్నారు. అధికారులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలకడం సబబు కాదని చెప్పారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు దశలవారీగా పోరాటాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. రాజ్‌కుమార్, నగేశ్ మాట్లాడుతూ...ఈ నెల 8న ఐకేపీ వీఓలతో మండల స్థాయిలో రౌండ్‌టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. 9,10 తేదీల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టి మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. 11,12 తేదీల్లో తమ పోరాటాన్ని సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు గానూ పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపడతామన్నారు. 14న వీఓఏలంతా కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టాలని కోరారు. 15,16 తేదీల్లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ కార్యాలయాల ముందు సామూహిక దీక్షలు చేస్తామని చెప్పారు. 18న మహిళా సమాఖ్య సభ్యులతో ప్రదర్శనలు చేపట్టి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. 21న డివిజన్ కేంద్రాల్లో బతుకమ్మ ఆడాలనీ, అదే రోజు సమ్మె శిబిరాల్లోనే పడుకుంటారని పేర్కొన్నారు. 22న కలెక్టరేట్లను ఎస్‌హెచ్‌జీ సభ్యులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఐకేపీ వీఓఏలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.