Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్ అక్తర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతమనీ, దాని ఫలితంగా ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకున్నదని కర్నాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్ అక్తర్ ప్రశంసించారు. ఆ కార్యక్రమం అమలులో ప్రభుత్వ సంకల్పం, అధికారులు, సిబ్బంది కృషి, ప్రజల సహకారం అడుగడుగునా కనిపిస్తున్నదని చెప్పారు. తెలంగాణకు హరితహారం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు జరిగిన క్రమంపై అధ్యయనం చేసేందుకు ఆయన శనివారం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో పర్యటించి దూలపల్లి ఫారెస్ట్ రీసెర్చ్ నర్సరీ, కండ్లకోయ ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు వెంట పచ్చదనం, అలాగే హైదరాబాద్‌లో అంతర్గత రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), మీడియన్ ప్లాంటేషన్లను పరిశీలించారు. సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ స్వయంగా కర్నాటక అధికారికి హరితహారం కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. కండ్లకోయ ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను చాలా చక్కగా అభివృద్ది చేశారన్నారు. రాష్ట్ర మంతటా ఇదే తీరులో 109 ఫారెస్ట్ పార్కులను పర్యావరణ పరంగా ఏర్పాటు చేయటం అభినందనీయమని కొనియాడారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, నగరంలోనూ పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. కర్నాటక ప్రభుత్వం కూడా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోందని, ఆ అధ్యయనంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత అరణ్యభవన్‌లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్ఎం. డోబ్రియాల్, కంపా పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరుతో జావేద్ అక్తర్ సమావేశమయ్యారు. తెలంగాణకు హరితహారం కార్యాచరణ, ఫలితాలను పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఈ సందర్భంగా వివరించారు.
పర్యటనలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి డీఎఫ్ఓలు ఎం. జోజి, సుధాకర్ రెడ్డి, జానకి రామ్‌తో పాటు, అటవీశాఖ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.