Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన జనం
- సైనిక లాంఛనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు
నవతెలంగాణ - గంగాధర/ బోయినిపల్లి
జమ్ముకాశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జవాన్ పబ్బాల అనిల్ భౌతికకాయం శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని తన స్వగ్రామమైన మల్కాపూర్ గ్రామానికి చేరుకుంది. అనంతరం ఆర్మీ అధికారుల నేతృత్వంలో శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, ఆర్డీవో పవన్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అంతమయాత్రలో పాల్గొని అనిల్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంతిమయాత్ర కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ వరకు కొనసాగింది. మధురానగర్ చౌరస్తా మీదుగా మల్కాపూర్ గ్రామం వరకు అంతిమ యాత్ర కొనసాగుతుందనే సమాచారంతో చూసేందుకు అనేక గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధురానగర్ చౌరస్తా ప్రధాన కూడలి వద్దకు భారీగా చేరిన ప్రజలు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. జై, జై జవాన్.. జై కిసాన్ అంటూ నినదించారు. అనిల్ భౌతికకాయంపై పూలు చల్లుతూ కుటుంబసభ్యులు, జనం కన్నీటి విడ్కోలు పలుకుతూ నివాళులు అర్పించారు.
వీర జవాన్ అనిల్ మృతికి సీపీఐ(ఎం) సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీర జవాన్ అనిల్ మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సంతాపాన్ని ప్రకటిం చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీజవాన్ పి అనిల్ జమ్మూకాశ్మీర్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనిల్ మృతికి సంతాపం తెలియ జేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. అనిల్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వీర జవాన్ల త్యాగాల వల్ల దేశ ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా జీవించగలుగు తున్నారని తెలిపారు. అలాంటి వీరజవాన్లందరికీ జోహార్లు తెలిపారు.