Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ డిక్లరేషన్‌తో కాంగ్రెస్ భరోసా : మాణిక్‌రావు ఠాక్రే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగుల ఆశలను బీఆర్ఎస్ సర్కారు నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే విమర్శించారు. ఈ క్రమంలోనే రానున్న కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులకు ఏం చేయబోతుందో చెప్పేందుకే 'నిరుద్యోగ డిక్లరేషన్' పేరుతో భరోసా పత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఉపాధి కరువై నిరుద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు జి. నిరంజన్, శివసేనారెడ్డి, నగేష్‌ముదిరాజ్, సునీతారావు, ఆడం సంతోష్, నూతి శ్రీకాంత్, ఫిరోజ్ ఖాన్‌తో కలిసి ఠాక్రే విలేకర్లతో మాట్లాడారు. నిరుద్యోగ యువ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఆకాంక్షలమేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన విమర్శించారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం : ఉత్తమ్
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతోనే రాష్ట్ర సాధన కోసం యువత పోరాడిందని తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందన్నారు. గతంలో 25 లక్షలు నిరుద్యోగులు ఉంటే, ఇప్పుడు 40 లక్షల మందికి చేరారని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ అసమర్థత, అవినీతి వల్లే పరీక్ష పేపర్లు లీకు అయినట్టు తెలిపారు. వాటిపై సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
కర్ణాటకలో కాంగ్రెస్సే : బెల్లయ్యనాయక్
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఏఐసీసీ ఆదివాసీ విభాగం ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మోడీ, అమిత్‌షా రెండుసార్లు సభకు ప్లాన్ చేసుకుని రద్దు చేసుకున్నారని గుర్తు చేశారు. మోడీకి అనుకూలమైన మీడియాలోనే బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రెజ్లర్లపై చైర్మెన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏడుస్తున్నా చర్యలు తీసుకోవడంలో మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ కూడ అస్తవ్యస్తంగా ఉందన్నారు.