Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ కార్యక్రమ ఆదేశాల అమల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా అలసత్వం వద్దనీ, సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. శనివారంనాడామె డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆదేశాలు జారీ చేశారు. కంటి వెలుగు, ఆరోగ్య మహిళా శిబిరాలను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలకు సంతప్తికరంగా సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో అన్ని కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేయాలనీ, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని చెప్పారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాల గణనను పూర్తి చేయాలని అన్నారు. జీవో 58కి సంబంధించి మిగిలివున్న పట్టాలను త్వరగా పంపిణీ చేయాలనీ, జీవో 59కి సంబంధించి కన్వీయన్స్ డీడ్ల పంపిణీని ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు వినూత్న పద్ధతులను సూచించాలని ఆమె కలెక్టర్లనుకోరారు. మరో 40 రోజుల్లో ప్లాంటేషన్ ప్రారంభం కానున్నదనీ, మొక్కలు అందుబాటులో ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని సులభంగా అధిగమించవచ్చని చెప్పారు. జిల్లాల్లో డీఏపీ, యూరియా తదితర ఎరువులు సరిపడా సరఫరా అయ్యేలా చూడాలనీ, స్టాక్‌ను పరిశీలించి రిటైల్ గోడౌన్లకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ పోటీపరీక్షల నిర్వహణపైనా చర్చించారు.
సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎస్సీ అభివద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, మున్సిపల్ పరిపాలనా శాఖ సంచాలకులు సత్యనారాయణ, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, ప్రత్యేక అధికారి సీసీఎల్ఏ ఆశిష్ సాంగ్వాన్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీ బాయి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి, డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ అఖిల్ పాల్గొన్నారు.