Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెత్తురు కారే రోజులు మళ్లీ వద్దు
- 15 లక్షలు వలసలు ఆపిన కేసీఆరే రాష్ట్రానికి దిక్కు
- మహబూబ్నగర్లో మంత్రి కేటీఆర్
- ఎన్నికలు వస్తున్నందున చాలామంది టూరిస్టులు వస్తుంటారని వ్యాఖ్య
నవతెలంగాణ- మహబూబ్నగర్ విలేకరి
'నెర్రెలు బారిన నేలలో, నెత్తురు కారిన తెలంగాణలో ఇప్పుడిప్పుడే నీళ్లు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అవకాశం ఇస్తే నెత్తురు కారే రోజులు తీసుకొస్తారు. మతం మంటల్లో ఉండే తెలంగాణ కావాల్నా.. పచ్చని పంటలతో ఉండే తెలంగాణ కావాల్నా.. రైతులు, ప్రజలు ఆలోచించాలి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ' నిరుద్యోగ మార్చ్ అని ఒక సన్నాసి ఇక్కడ మీటింగ్ పెట్టిండు. 2014లో మోడీ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. రూ. 15 లక్షలు ఇస్తానన్నాడు. కానీ ఇవ్వలేదు. రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేసిన మోడీ ఒక దిక్కు ఉన్నాడు.. 15 లక్షల మంది వలసలు ఆపి ఉపాధి కల్పించిన కేసీఆర్ మరో దిక్కు ఉన్నాడు. ఆలోచించి ఓటేయండి తప్పా ఆగం కాకండి.' అని మహబూబ్నగర్ జిల్లా ఓటర్లను కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇస్తామని గతంలో మోడీ, అమిత్ షా చెప్పారని, మరి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా.. కృష్ణా నదిలో మన వాటా, ఏపీ వాటా తేల్చలేదన్నారు. రైతుల ఆదాయం పెంచలేదు కానీ అదానీ ఆదాయం పెంచిండు అని విమర్శించారు. 'గుజరాతోళ్ల చెప్పులు మోసేటోళ్లు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. కానీ రోషం కల్ల తెలంగాణ బిడ్డలు, పాలమూరు పౌరుషంతో ఉండే తమ్ముళ్లంతా ఆలోచన చేయాలి. ఎవరు ఈ రాష్ట్రానికి మంచివారు. ఎవరి వల్ల ఈ రాష్ట్రంలోని రైతు బాగుపడుతాడు అనే విషయాన్ని ఆలోచించాలి' అన్నారు.. పెద్దలకు రుణాలు మాఫీ చేసే సన్నాసులు కావాల్నా.. పేద ప్రజల కష్టాల్లో అండగా ఉండే కేసీఆర్ కావాల్నా తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'ఎన్నికలు సమీపంచే కొద్ది చాలా మంది టూరిస్టులు వస్తారు.. మొన్ననే రేవంత్ రెడ్డి వచ్చి నోటికొచ్చినట్లు అడ్డగోలు మాటలు మాట్లాడారు. తెలంగాణను తెచ్చిన సీఎం, రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎం. కేసీఆర్ను గౌరవించకుండా నోటికొచ్చినట్టు నీచమైన మాటలు మాట్లాడిండు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. 55 ఏండ్లు పరిపాలించింది నీ సన్నాసి పార్టీ. ఆనాడు అధికారం ఇచ్చినప్పుడు అన్ని చేసి ఉంటే నేడు ఎందుకు సమస్యలు ఉంటుండే. తెలంగాణను భారతదేశంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం' అని కేటీఆర్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పారు.