Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు
- పలు తీర్మానాలకు ఆమోదం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ముగిశాయి. ఆదివాసీలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆదివాసీల సమస్యలపై రానున్న కాలంలో సమరశీల పోరాటాలను నిర్వహించాలని మహాసభ పిలుపునిచ్చింది.
ఈ మేరకు మహాసభ తీర్మానాలు వివరాలను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మిడియా బాబురావు మీడియాకు విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ హక్కులపైన తీవ్రమైన దాడి చేస్తున్నదని ఆయన విమర్శించారు.
ఆదివాసీ చట్టాల్లో మార్పులు తీసుకు రావడం ద్వారా దేశంలోనూ రాష్ట్రంలోనూ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద ప్రకృతి వనరులన్నింటినీ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని మహాసభ డిమాండ్ చేసింది. బతుకుదెరువు కోసం తెలంగాణ భూభాగంలోకి వచ్చి నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడే జీవనం సాగిస్తున్న వలస ఆదివాసీలకు ఎస్టీ కులం సర్టిఫికెట్లు జారీ చేయాలి. వారికి విద్యా వైద్యం ఉపాధి అవకాశాలను కల్పించాలని సభ డిమాండ్ చేసింది.
- వలస ఆదివాసీ గ్రామాల్లో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వారికి ఆశ్రమ పాఠశాలలు గురుకుల విద్యాలయాలు కళాశాలలో సీట్లను కేటాయించాలి.
- ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని, ఎస్టీ జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని తీర్మానం ఆమోదించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రభుత్వ విభాగాలలో లక్షలాది ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టాయని ఈ పోస్టులన్నిటిని తక్షణమే భర్తీ చేయాలి. ప్రయివేటు రంగ పరిశ్రమల్లో స్థానిక గిరిజన యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
- అత్యంత పురాతనమైన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కలలను కళారూపాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
- మాతృభాషలో విద్యాబోధన కొనసాగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. లిపిని తయారు చేయటం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్రంలో తునికాకు బోనస్ పంపిణీ వెంటనే ప్రారంభించాలి.
- ఆదివాసీలు, దళితులు ఇతర అణగారిన వర్గాల పైన హిందూ మత ఉన్మాద సంస్థలు దాడులు ఆపాలి.